“అణ్వస్త్రాల గురించి వాళ్లకు అంతవరకే తెలుసు.. కానీ మాకంటూ వాటిపై సొంత అవగాహన ఉంది. మా వ్యూహాలు మాకున్నాయి. అణుయుద్ధాలే కాదు.. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అంటూ పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు ఐఏఎఫ్ కొత్త చీఫ్ ఎయిర్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. భారత్ తో అణుయుద్ధానికి మేం సిద్ధమంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలకు భదౌరియా ధీటైన సమాధానమిచ్చారు. ఐఏఎఫ్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన భదౌరియా… పాక్ ప్రధానికి ఘాటైన కౌంటర్ వేశారు. ఐఏఎఫ్ 26వ చీఫ్‌గా ఆర్‌కేఎస్ భదౌరియా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం వాయుసేనాధిపతిగా ఉన్న బీఎస్ ధనోవా పదవీ కాలం నేటితో ముగిసిన నేపథ్యంలో… వైస్ చీఫ్‌గా ఉన్న భదౌరియా ఐఏఎఫ్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ధనోవా పదవీకాలం ముగియడంతో భదౌరియాను ఐఏఎఫ్ నూతన చీఫ్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల మొదట్లోనే నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 1980 జూన్‌లో వాయుసేనలో చేరిన భదౌరియాకు… నాలుగు దశాబ్దాల్లో మొత్తం 4,250 గంటల పాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. తన కెరీర్ లో ఆయన 26 రకాల విమానాలు నడిపారు. అతి విశిష్ట్ సేవా మెడల్, వాయు సేన మెడల్, పరమ్ విశిష్ట్ సేవా మెడల్ తదితర పతకాల్ని అందుకున్నారు. అంతేకాదు.. త్వరలో రానున్న తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపే వారిలో ఆయన కూడా ఉంటారు. ఫ్రాన్స్‌తో భారత్ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం కుదుర్చుకోవడంలో భదౌరియా కూడా కీలక పాత్ర పోషించినట్టు చెబుతారు.