కేటీఆర్ సీఎం కాబోతున్నాడా ? రేపటి మీటింగ్ పై ఉత్కంఠ…

కేటీఆర్ సీఎం కాబోతున్నాడా ? రేపటి మీటింగ్ పై ఉత్కంఠ…

చాలా రోజులైంది…పార్టీ మీటింగ్ పెట్టక. సడన్ గా ఎల్లుండి మీటింగని నిన్న ప్రకటించేశాడు పెద్ద సారు. సారు పిలిసిండు… అందరినీ రమ్మన్నడు. ఎందుకు ? ఏం మాట్లాడతరు ఆ మీటింగుల..? రొటీన్ పొలిటికల్ మీటింగేనా ? లేకపోతే భారీ ఎత్తున ప్లీనరీ పెడదామంటడా ? కానీ…జనం మదిలో ఇవేవీ లేదు. టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో అంతకన్నా లేవు. కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడే సమయం ఆసన్నమైందా ? కబ్‌ బనేగా..? స్పష్టత ఇచ్చేస్తారా..? అందరిలోనూ ఇదే టెన్షన్‌. సంకేతాలిచ్చి సరిపెడతారా..? సరాసరి ప్రకటనే వచ్చేస్తుందా..? అధికారిక ‘ముద్ర’పడుతుందా..? సంచలనాలేమీ లేకుండా ఆనవాయితీగా అధినేత దిశానిర్దేశంతో ముగుస్తుందా..?

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకస్మికంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తుండటంపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్‌ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్య క్షులు హాజరవుతారు.

పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల నియామకం, ఏప్రిల్‌ 27న పార్టీ వార్షికోత్సవం సందర్భంగా మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారని పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ప్లీనరీ, సంస్థాగత అంశాలపై చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నా… ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ బాధ్యతలు స్వీకరిస్తారని జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్‌ ఈ సమావేశంలో స్పష్టతనిచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.