సార్.. కార్.. కేటీఆర్ అన్నారు కానీ…

సార్.. కార్.. కేటీఆర్ అన్నారు కానీ…

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్థానంలో కేటీఆర్ సారు వస్తారంటూ గత కొద్దిరోజులుగా గులాబీ వర్గాలు తెగ హడావిడి చేశాయి. మంత్రులు, పలువురు గులాబీనేతలు కూడా కేటీఆర్ కాబోయే సీఎం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేశారు. అయితే ఇవాళో, రేపో కేటీఆర్ పట్టాభిషేకం అనుకున్న సమయంలోనే కేసీఆర్ ఓ క్లారిటీ ఇచ్చారు. తాను మరో పదేళ్లపాటు సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. సీఎం మారుతున్నారని వస్తున్న వార్తలను నమ్మవద్దని కుండబద్దలు కొట్టారు.

అయితే పద్మాదేవేందర్ గౌడ్ ఓ మీటింగ్ లో మాట్లాడుతూ.. కాబోయే సీఎం కేటీఆర్ అంటూ హింట్ ఇచ్చారు. ఇక మరోమంత్రి తలసాని అయితే కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అని ఎదురు ప్రశ్నించారు. అయినా మంత్రులే ఇలాంటి హింట్లు ఇచ్చి.. గులాబీ శ్రేణుల్లో లేనిపోని కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చారు. కానీ కేసీఆర్ మాత్రం ఇలాంటి పనికిమాలిన విషయాలను, అబద్ధాలను ప్రచారం చేసే వారికి కర్రు కాల్చి బుద్ధి చెప్పాలని అన్నారు. మరి పెద్ద సారు ఎప్పుడు తన పక్కనే ఉండే తలసానికి, పద్మాదేవేందర్ గౌడ్ లకు కూడా కర్రు కాల్చి పెడతారేమో అంటూ వైరి వర్గాలు జోకులు వేసుకుంటున్నాయి. మొత్తానికి కేటీఆర్ కాబోయే సీఎం అనే అంకానికి ప్రస్తుతానికి అయితే తెర పడింది.