
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. నామినేషన్ల పర్వం ముగిసేసరికి ప్రధాన అభ్యర్థులుగా(కాంగ్రెస్-నల్లమడ పద్మావతి ఉత్తమ్ రెడ్డి, టీఆర్ఎస్-సైదిరెడ్డి, టీడీపీ-చావా కిరణ్మయి, బీజేపీ-రామారావు) నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు మరో 60 మంది కూడా నామినేషన్లు ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే 85 ఏళ్ల ఓ వృద్ధురాలు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీస్కొచ్చేందుకు నామినేషన్ వేయడం హైలైట్. లక్ష్మీనర్సమ్మ అనే వృద్ధురాలు తనకున్న వందెకరాల భూమికి పట్టా ఇవ్వట్లేదని అధికారులు చుట్టూ తిరిగినా పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదని ఓ ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా తన భూమికి పట్టా ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయినా అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రభుత్వంపై నిరసనగా ఉప ఎన్నిక బరిలో నిలిచింది. నడవడానికి చేతగాకపోయినా ఊతకర్రతో వచ్చి మరీ నామినేషన్ వేయడం విశేషం. లక్ష్మీనర్సమ్మతో పాటు మట్టంపల్లి మండలం గుర్రంపోడు గిరిజనులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.