Sankarabharanam : కథానాయకుడెవరంటే చెప్పలేం…. కథే నాయకుడు!

Sankarabharanam
sankarabharanam : కథానాయకుడెవరంటే చెప్పలేం…. కథే నాయకుడు! పోనీ హీరోయిన్నో? ఎబ్బే! అందరూ ‘అదోరకం’ పాత్రలిచ్చి అవమానించిన మంజుభార్గవి! సలీం డాన్సులు, చక్రవర్తి మ్యూజిక్కూ….? అవేంలేవు. మరేమున్నాయండీ మీ సినిమాలో? శిశుర్వేత్తి పశుర్వేత్తి….అంటూ మొదలైంది సుత్తి. గోదాట్లో పంచె తడుపుకుని ఆరేసుకుంటున్నాడో పెద్దాయన. తరవాత..? అది చిరిగిపోయిందని చూపించారు. ఏదో ఫ్లాష్‌బాకుండే వుంటుంది. ఎక్కడా డైలాగుల్లేవేమిటి? ఎవరైనా ఏదైనా మాట్లాడితే కథేఁవిటో తెలుస్తుందని కొంతసేపు చూసా!
ఆ కొంతసేపు ఎంతసేపైందో తెలీలేదు. పక్కనెవరున్నారో మర్చిపోయాను. పది పన్నెండేళ్ళ పిల్లాడి అభిరుచులు, అంతరంగాలు, అభిప్రాయాలు ఎలావుంటాయో అందరికీ తెలిసిన విషయమే! అయినా నేనెందుకంతలా అతుక్కుపోయాను? నాకెందుకలా ఏడుపొచ్చేస్తోంది? చక్రవర్తీ, సలీమూ గుర్తుకురాలేదేం? బొడ్డుమీద బొంగరాలూ, నుదుటిమీద జుట్టు వుంగరాలు చూడ్డానికి అలవాటుపడ్డ ప్రాణం….. ఇందులో ఏంచూసింది?
శిశుర్వేత్తి పశుర్వేత్తి అనెందుకు మొదలెట్టారో అప్పుడర్ధమైంది!
ఏ ధైర్యంతో విశ్వనాథుణ్ణి నమ్మారో తెలీదు. గోదారొడ్డూ, అన్నారం కొండా లొకేషన్లు. జనాలకి నోరుతిరగని పాటలు. సారిగరీ గపదాప…. అంటూ వెరైటీ డాన్సులు! ఏడిదవారికి చివరికి బూడిద మిగులుస్తాడేమో ఈకాశీవిశ్వనాథుడు!?….. అని అనుకున్నారందరూ! నిరక్షరాస్యులుకూడా నిరాటంకంగా పాడేసుకునేవారు ఆపాటలు! సంగీతం పాడితే పీక కోసేస్తామనేవాళ్ళు కూడా చెవి కోసుకునేంతలా ఎక్కేశాయందరికీ!
‘మావూరివ్వలేదు ‘శంకరాభరణం.’ ఆర్నెల్లాగాల్ట! అంచేత నేనూ మీపిన్నీ రేపు ఈస్టుకి మీవూరొస్తున్నాం. సినిమాచూసి ఎల్లుండి జనతాకెళిపోతాం. టిక్కెట్లు చెప్పుంచు’ అంటూ వుత్తరాల్రాసి మరీ వూళ్ళెళ్ళి చూసారు శంకరాభరణాన్ని!
‘సినిమా అనేది కళ!’ అంటూ చెప్పే ‘వనం’లో కళనే సినిమాగా చూపించిన తులసిమొక్కలు….. నాగేశ్వరుడు, విశ్వనాథుడు! సంగీతసాహిత్యాలనే నాయికానాయకులనుకున్న ‘స్వాతిముత్యాలు!’ గొంగళిపురుగులా వికారంగావున్న కథలమధ్యలో ‘సీతాకోకచిలక’ని ఎగరేసిన అజేయుడు….ఏడిద నాయుడు! ఏదైనా సినిమాకెళితే సిగ్గుతో తలొంచుకుని, త్వరగా అయిపోతే బావుణ్ణని దేవుణ్ణి తలంచుకుని బ్రతుకుతున్న తెలుగు ప్రేక్షకుల్ని తలెత్తుకునేలా చేసిన ‘ఆపద్బాంధవుడు’……ఇంకెవరు? వాన్ హ్యూసన్ ఎడ్వర్టయిజ్‌మెంట్ లో క్యాప్షన్ గుర్తుందా? ‘అండర్లైన్ యువర్ ప్రజెన్స్’ అని….?
ఎందరో నిర్మాతలు. డబ్బున్నవాళ్ళు, డబ్బే వున్నవాళ్ళు…… ఇలా చాలామందిలో తప్పనిసరిగా అండర్లైన్ చెయ్యదగ్గ నిర్మాత…. ఏడిద నాగేశ్వరరావుగారు. అహనాపెళ్ళంటలో కోటశ్రీనివాసరావులా “నాకేంటి? అహఁ నాకేంటని?” అనుకునే మనిషయితే అన్ని కళాఖండాల్ని కలకండముక్కల్లా మనకందించేవాడే కాదు. విశ్వనాథుడు గణపతైతే నాగేశ్వర్రావు దంతం. దాని సాయంతోనే మన తెలుగు సినిమాకి ‘పూర్ణోదయ’మైంది! అన్నవరం గుర్తొచ్చినపుడల్లా సత్యనారాయణ ప్రసాదం రుచి, శంకరాభరణం తీసిన మీ అభిరుచి……గుర్తొచ్చి తీరతాయి!
అరువు గొంతులు, దరువు సంగీతాలు, పరువుపోయే డైలాగుల్తో మంచి సినిమాకోసం కరువెత్తి వున్నాం! జిలిబిలి పలుకుల కోసం, మిన్నేటి సూరీడు కోసం, చిన్నారి పొన్నారి కిట్టయ్యల కోసం, లాలిపాటల కోసం, ఇంకా….. వెన్నెల్లో గోదారి అందం కోసం కన్నులు కాయలుకాచిన మేమంతా ‘బ్రోచేవారెవరురా?’ అంటూ ఎదురుచూస్తున్నాం! శంకరాభరణానికి నలభయ్యారవ జన్మదిన శుభాకాంక్షలు!

Credit  :  జగదీశ్ కొచ్చెర్లకోట