BRS కు బిగ్ షాక్.. గువ్వల బాలరాజు రాజీనామా!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు(Guvvala Balaraj ), బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయన, ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గువ్వల బాలరాజు గెలుపొందారు. అయితే 2023 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గువ్వల బాలరాజు త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈనెల 9న ఆయన బీజేపీలో అధికారికంగా చేరవచ్చని కూడా సమాచారం. అయితే, దీనిపై ఆయన కానీ, బీజేపీ నాయకులు కానీ ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. గువ్వల బాలరాజు రాజీనామా బీఆర్‌ఎస్ పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బెనని చెప్పాలి.