మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయంలో రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తెచ్చానని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం హామీ ఇచ్చినా తనకు మంత్రి పదవి దక్కలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కంటే జూనియర్లకు మంత్రి పదవులు దక్కడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో పక్షపాతం చూపుతున్నారని ఆయన ఆరోపించినట్లు సమాచారం. సోషల్ మీడియాపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా విమర్శించారు. ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీని వీడతారన్న పుకార్లు కూడా వ్యాపించాయి. అయితే, దీనిపై ఆయన నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలపై సోదరుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.