Rashid Khan: ఒకేఒక్కడు… చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్

Rashid Khan : అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్‌లో ఒక సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో 650 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన ‘ది హండ్రెడ్ 2025’ టోర్నమెంట్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరఫున లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతమైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ కేవలం 20 బంతులు వేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో అతను తన టీ20 కెరీర్‌లో మొత్తం వికెట్ల సంఖ్యను 651కి పెంచుకున్నాడు. తన టీ20 కెరీర్‌లో 478 ఇన్నింగ్స్‌లలో 18.54 సగటుతో 651 వికెట్లు పడగొట్టాడు. నాలుగు సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉండేది. బ్రావో తన కెరీర్‌లో 631 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ (Rashid Khan) ఈ ఏడాది ప్రారంభంలోనే బ్రావో రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు.

టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు

రషీద్ ఖాన్ 651 (478 ఇన్నింగ్స్‌లు)
డ్వేన్ బ్రావో 631 (546 ఇన్నింగ్స్‌లు)
సునీల్ నరైన్ 589 (544 ఇన్నింగ్స్‌లు)
ఇమ్రాన్ తహీర్ 547 (417 ఇన్నింగ్స్‌లు)
షకీబ్ అల్ హసన్ 498 (443 ఇన్నింగ్స్‌లు)
ఆండ్రీ రస్సెల్ 485 (497 ఇన్నింగ్స్‌లు)
క్రిస్ జోర్డాన్‌ 436 (404 ఇన్నింగ్స్‌లు)
వహాబ్ రియాజ్ 413 (344 ఇన్నింగ్స్‌లు)