Komatireddy : తెలంగాణలో రాజకీయాల్లో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy )సంచలనంగా మారారు. ఇటీవల ఏర్పడిన కేబినేట్ కూర్పులో చోటు దక్కకపోవడంతో పట్ల ఆయన చాలా ఆసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన సంచలన కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పదేళ్లు ముఖ్యమంత్రిగా తానే ఉంటానని బహిరంగంగా చెప్పడం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి విరుద్ధమంటూ ట్వీట్ చేసి రచ్చలేపారాయన.
ప్రభుత్వం చేస్తున్న కొన్ని తప్పులను ప్రశ్నించకపోతే, పార్టీకి భవిష్యత్తులో నష్టం తప్పదని రాజగోపాల్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి తన పనితీరు ద్వారా ప్రజల విశ్వాసం పొందాలని, కేవలం మాటలతో కాదని సూచించారు. ప్రతిపక్షాలను తిట్టడం కాకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరేటప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి పదేపదే చెబుతున్నారు.
కానీ ఆ హామీని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి కోసం తాను ఎవరి కాళ్లూ పట్టుకోవాల్సిన అవసరం లేదని, మునుగోడు ప్రజల సంక్షేమం కోసం తన ఎమ్మెల్మే పదవిని త్యాగం చేయడానికి తాను ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో వివాదాలు నడుస్తున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, పార్టీ అంతర్గత విషయాలపై చర్చించలేదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి రాకపోవడం పట్ల కోమటిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారన్నది మాత్రం వాస్తవం..అయితే ఆ మంత్రి పదవి ఆశ కలిపించడం వెనుక నలుగురు ఉన్నారని తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరితే తనకు మంత్రి పదవి ఇస్తామని భట్టి విక్రమార్క, మాణిక్ రావ్ ఠాక్రే, సునీల్ కనుగోలు, మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. అయితే ఈ నలుగురు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీ గురించి అధిష్టానం దగ్గర పర్మిషన్ తీసుకున్నారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ ఎక్కడా తగ్గలేదు. హామీల నుంచి నేతల వరకు ప్రతి ఒక్కరికి ఏదోకటి చెప్పి చేర్చుకుంది.
మంత్రి పదవి హామీతోనే వివేక్, రాజగోపాల్ బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. వివేక్ కు మంత్రి పదవి దక్కగా.. రాజగోపాల్ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. కాంగ్రెస్ లో చేరిన నేతలకు సునీల్ కనుగోలు, ఠాక్రే ఎడాపెడా హామీలు ఇచ్చారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పుడు ఆ హామీలే పార్టీకి, ప్రభుత్వానికి గుదిబండలా మారాయని పార్టీలోని నేతల నుంచి వినిపిస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల టైమ్ లో కూడా సీఎం రేవంత్ కూడా రాజగోపాల్ కు మంత్రి పదవి ఇప్పిస్తానని మాట నిలబెట్టుకోలేకపోయారు. కోమటిరెడ్డి సోదరుల్లో ఎవరో ఒకరికి మాత్రమే క్యాబినెట్లో చోటు ఇస్తాని అధిష్టానం ఖరాఖండిగా స్పష్టం చేసినట్లు సమాచారం. సో ఇప్పుడు రాజగోపాల్ ఏం చేస్తారన్నది మరో హాట్ టాపిక్.