Prajwal Revanna case : తప్పు చేసిన వాడికి ఏదో రోజు శిక్ష పడటం ఖాయం.. మాజీ ఎంపీ ప్రజ్వేల్ రేవణ్ణ కేసులో కూడా అంతే. లైంగిక వేధింపు కేసులో ఆయనకు కోర్టు జీవితఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తన కుటుంబానికి చెందిన ఓ పనిమనిషిపై అత్యాచారం చేసిన కేసులో(Prajwal Revanna case ) ప్రజ్వల్ రేవణ్ణను ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. బాధితురాలి చీరే ప్రజ్వేల్ రేవణ్ణకు శిక్ష పడేలా చేసింది.
పనిమనిషిపై అత్యాచారం చేసిన ఆ తరువాత ఆమె చీరను ఫామ్ హౌజ్ లోని ఆటకపైన పడేశాడు ప్రజ్వేల్ రేవణ్ణ. విచారణ సమయంలో తనపై లైంగిక దాడి తర్వాత ప్రజ్వల్ తన చీరను బలవంతంగా తీసుకెళ్లాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. అది ఇప్పటికీ అతని ఫామ్‌హౌస్‌లో ఎక్కడో ఉందని ఆమెకు అనుమానం వ్యక్తం చేసింది. ఆ సమాచారం మేరకు పోలీసులు సోదాలు నిర్వహించగా, అటకపై చీర దొరికింది.
దీనిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగా అది DNA టెస్టు ద్వారా చీరపై ఉన్న ప్రజ్వేల్ రేవణ్ణ స్పెర్మ్ సెల్స్ తో మ్యాచ్ అయింది. దీంతో రేవణ్ణను ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించి ఆయనకు జీవిత ఖైదు శిక్ష విధించింది.కోర్టు ఆయనకు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఇందులో రూ.7 లక్షలు బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. బాధితురాలు తనపై 2021లో రెండుసార్లు అత్యాచారం జరిగిందని, ఆ సంఘటనలను ప్రజ్వల్ రేవణ్ణ తన మొబైల్లో వీడియోగా రికార్డు చేశారని కోర్టులో సాక్ష్యం చెప్పారు.
ప్రజ్వల్ రేవణ్ణపై మొత్తం నాలుగు అత్యాచారం కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వచ్చిన తీర్పు వాటిలో మొదటి కేసులో మాత్రమే. మిగిలిన కేసుల్లో విచారణ కొనసాగనుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన లైంగిక వేధింపుల వీడియోలు పెద్ద సంచలనం సృష్టించాయి. వేలాది వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌లు హాసన్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి.
ఈ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయారు. దీంతో ఆయనపై లైంగిక వేధింపులు, అత్యాచారం వంటి ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఆయన తండ్రి హెచ్.డి. రేవణ్ణ కూడా బెయిల్‌పై విడుదలయ్యారు.