Samarlakota Case: సామర్లకోట కేసులో బిగ్ ట్విస్ట్.. సాక్ష్యాలు లేకుండా చేయడానికి

Samarlakota Case

Samarlakota Case

Samarlakota Case : కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన తల్లీ, ఇద్దరు కుమార్తెల దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి, ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణాలను ఎస్పీ బిందుమాధవ్‌ మీడియాకు వెల్లడించారు. వివాహేతర సంబంధమేఈ హత్యలకు కారణమని దర్యాప్తులో తేలిందన్నారు.

మాధురికి, సురేష్ కు మధ్య వివాహేతర సంబంధం ఉందని.. ఆమె అడిగిన వస్తువులు కొనిచ్చేందుకు రూ.7 లక్షల వరకు ఖర్చు చేశాడని తెలిపారు. మాధురి, సురేష్ మధ్య రెండేళ్లుగా సంబంధం ఉంది. ఈ సంబంధం గురించి సురేష్ భార్యకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. మాధురి సురేష్‌పై ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావడమే కాకుండా, ఖరీదైన బహుమతులు, కొనివ్వాలని డిమాండ్ చేయడంతో ఈ ఘర్షణలు తీవ్రమయ్యాయి.

నిందితుడు సురేష్‌ భార్యకి కూడా వీరి వివాహేతర సంబంధం గురించి తెలిసింది. దీంతో మాధురిపై విరక్తి పెరిగి హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఆగస్టు 2న, మాధురి భర్త ప్రసాద్ నైట్ డ్యూటీకి వెళ్లిన సమయంలో సురేష్ ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో సురేష్ మాధురిని కర్రతో కొట్టి చంపాడు. ఈ సంఘటనను చూసిన ఇద్దరు పిల్లలు నిద్రలేచి కేకలు వేయడంతో, సాక్ష్యాలు లేకుండా చేయడానికి సురేష్ ఆ పిల్లలను కూడా దారుణంగా హత్య చేశాడు.

ఈ ఘటన చోరీ కోసం జరిగినట్టుగా చిత్రీకరించేందుకు నగలు, నగదు కూడా ఎత్తుకెళ్లాడు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయడానికి కాల్ డేటా రికార్డులను పరిశీలించారు. మాధురి, సురేష్ మధ్య వెయ్యికి పైగా కాల్స్ జరిగాయని గుర్తించారు. పోలీసులు నిందితుడు సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసును వేగంగా పూర్తి చేసి, నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ దారుణ సంఘటన సామర్లకోటలో తీవ్ర భయాందోళనలను కలిగించింది.