Darshan : కన్నడ నటుడు దర్శన్‌కు బిగ్‌షాక్ తగిలింది. రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీపతో పాటుగా మరో ఆరుగురికి కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు గురువారం (ఆగస్టు 14, 2025) రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కనపెడుతూ సుప్రీం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాకుండా దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దర్శన్‌కు బెయిల్ ఇచ్చేందుకు చట్టపరమైన కారణాలు లేవని జెబి పార్దివాలా, ఆర్ మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న అత్యున్నత న్యాయస్థానం.. బెయిల్ ఇవ్వడం వల్ల సాక్షులపై ప్రభావం పడే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
కస్టడీలో దర్శన్‌కు స్పెషల్ ట్రీట్‌మెంట్ అవసరం లేదంది. జైళ్లలో నిందితులకు 5 స్టార్ ట్రీట్‌మెంట్ ఇస్తే చర్చలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. దర్శన్‌ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న దర్శన్‌ను బెంగళూరు పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాన్ని ట్రయల్ కోర్టుకు సమర్పించి వారెంట్ పొందిన వెంటనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. కాగా 2024 డిసెంబర్ 13న దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కేసు నేపథ్యం ఇదే
దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుకాస్వామి అభ్యంతరకర సందేశాలు పంపినందుకు, దర్శన్ తన అభిమానుల ద్వారా అతడిని కిడ్నాప్ చేసి, హింసించి, హత్య చేయించారని ఆరోపణలు ఉన్నాయి. 2024 జూన్‌లో రేణుకాస్వామి మృతదేహం బెంగళూరులోని ఒక కాలువలో లభించింది. ఈ కేసులో దర్శన్ గత ఏడాది జూన్ 11న అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు మొదట వైద్య కారణాలతో మధ్యంతర బెయిల్, ఆపై డిసెంబర్ 2024లో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీనిపై పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, ఇప్పుడు బెయిల్ రద్దయ్యింది.