AP FREE BUS : ఇవాళ్టి నుంచి ఫ్రీ బస్సు..రూల్స్, రెగ్యులేషన్స్ ఇవే!

ఏపీలో నేటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం మొదలుకానుంది. “స్త్రీ శక్తి” పథకం పేరుతో కూటమి సర్కార్ ఈ పథకాన్ని అమలు చేయనుంది. సీఎం చంద్రబాబు చేతుల మీుదుగా ఈ స్కీమ్ ను ప్రారంభించనున్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యేల చేతులమీదుగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 2.62 కోట్ల మంది మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు లబ్ధి పొందనున్నారని సర్కార్ చెబుతోంది. ఈ పథకం వల్ల ఆర్టీసీకి నెలకు రూ. 161.83 కోట్లు, ఏడాదికి సుమారు రూ. 1,942 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

రూల్స్, రెగ్యులేషన్స్ ఇవే

ఆర్డినరీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఈ పథకం వర్తిస్తుంది. నాన్-స్టాప్, ఇంటర్-స్టేట్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులలో ఈ పథకం వర్తించదు. ప్రయాణించే మహిళలు తప్పనిసరిగా ఏపీ వాసులు అయి ఉండాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా గుర్తింపు కార్డును చూపించవచ్చు. ప్రయాణికులకు కండక్టర్లు జీరో ఫేర్ టికెట్‌ను జారీ చేస్తారు. ఈ టికెట్ ఖర్చును ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. ఈ పథకం కింద, తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని ప్రత్యేక మార్గాల బస్సులకు ఉచిత ప్రయాణం వర్తించదు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం.. మొత్తం 11,449 బస్సులలో సుమారు 74% బస్సులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఈ పథకం కోసం 6,700 నుండి 8,458 వరకు బస్సులను కేటాయించారు.