Telangana politics: అన్నా మనం కొత్త పార్టీ పెడదాం .. బీజేపీ ఎంపీతో కోమటిరెడ్డి భేటీ?

Telangana politics: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇందులో పదేళ్లు బిఆర్ఎస్ అధికారంలో ఉంటే..ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి.. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి అని చెప్పవచ్చు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఫెయిల్ అయి అభాస పాలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు బీజేపీ సరైన నాయకత్వం లేకపోవడంతో పలుచనబడింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉన్నప్పటికీ.. మూడో ప్రాంతీయ పార్టీకి స్కోప్ ఉందని ఓ ఇద్దరు కీలక నేతలు భావించారట. ఇటీవల వీరిద్దరూ రహస్యంగా భేటీ అయి పార్టీ ఏర్పాటు, సాధ్యాసాధ్యాలపై  చర్చించినట్లుగా పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వాళ్ళే బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

ఈటల రాజేందర్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (BJP)లో కొనసాగుతున్నారు. ఆయన మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మునుగోడు నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే వీరిద్దరూ ప్రస్తుత పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో బీజేపీ అంతర్గత రాజకీయాలపై ఈటల రాజేందర్ అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించి ఈటెల భంగపడ్డారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ తో విబేధాలు కూడా ఇటీవల రచ్చకెక్కాయి.  అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పి కాంగ్రెస్, రేవంత్ మోసం చేశారని బహిరంగంగానే ఏకిపారేస్తున్నారు కోమటిరెడ్డి.

ఈ క్రమంలో రాష్ట్రంలో మూడో ప్రాంతీయ పార్టీకి స్కోప్ ఉందని భావించిన ఈ ఇద్దరు నేతలు ఆ దిశగా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలకి సొంత ఇమేజ్ ఉండడం, పార్టీ కోసం ఫండ్ పెట్టేంత స్టేటస్ కూడా ఉంది. తెలంగాణలో బీఆర్‌ఎస్ బలహీనపడిన తర్వాత, ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఈ ఖాళీని భర్తీ చేయడానికి ఈ ఇద్దరు నేతలు కలిసి ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారట. రేవంత్ దెబ్బకి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమేనని, బీజేపీకి అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని ఈ ఇద్దరు నేతలు బలంగా నమ్ముతున్నారట. ఇప్పుడు పార్టీ పెడితే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఆలోచనలో ఉన్నారట. 
వాస్తవానికి వీరిద్దరూ పార్టీ పెట్టాలని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అనుకున్నారట కానీ అప్పటి పరిస్థితులు అనుకూలించక వెనక్కి తగ్గారని సమాచారం. మరి ఇప్పుడు ఏం చేస్తారు అన్నది చూడాలి.