Marwadi : మార్వాడీలు మన నెత్తికెక్కారా..మనం ఎక్కించుకున్నామా?

Marwadi : ‘మార్వాడీలు ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడే ఉన్నారు. మన సంస్కృతిలో కలిసిపోయారు’ అంటున్నారు కొందరు పార్టీనేతలు. ‘మార్వాడీలు ఎప్పుడూ ఇక్కడి సంస్కృతిలో కలిసిపోలేదు. వారు ఇక్కడి సంస్కృతితో మమేకం కాలేదు’ అంటున్నారు ఉద్యమకారులు. నిజానికి మార్వాడీలు ఈ సంస్కృతిలో ఎప్పుడూ కలిసిపోలేదని, కలిసిపోయామని వారూ బలంగా చెప్పుకోలేరనేది నిర్వివాద అంశం. తెలుగు మాట్లాడేవారు మార్వాడీ షాపులోకి వెళ్లినప్పుడు, హిందీ మాట్లాడేవారు ఆ షాపులోకి వెళ్లినప్పుడు ఆ మార్వాడీ యజమాని చూపించే తేడా ఇందుకు చక్కని ఉదాహరణ.

నా ప్రశ్నేమిటంటే, నిజంగా ఒకరు మరొకరి సంస్కృతిలో కలిసిపోవాలా? అది అత్యవసరమా? సంస్కృతిలో కలిసిపోకుండా ఇక్కడివారితో కలిసి ఉండటం కుదరదా? ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే భావన మూలం ఇదే కదా? అలాంటప్పుడు మార్వాడీలు మన సంస్కృతిలో కలిసిపోవాలని కోరడం కరెక్టేనా? మార్వాడీలు ఇక్కడి వారితో పెళ్లిళ్లు చేసుకున్నా సరే, లోలోపల వారి సంస్కృతే కొనసాగుతూ ఉంటుంది. అది తప్పని మనమెందుకు అనుకోవడం? మన సంస్కృతి మనకెలా గొప్పో, వాళ్ల సంస్కృతి వాళ్లకు గొప్పగా ఉంటుంది కదా? దాన్ని కాదనడానికి మనమెవరం?

ఇంకోటి.. మార్వాడీలు మన సంస్కృతిని నీచంగా చూస్తున్నారన్న ఆరోపణ. ఎలా? ఏ అంశాన్ని బట్టి ఈ నిర్ధారణకు వస్తున్నాం? నిజానికి మనమే వాళ్ల సంస్కృతిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నాం. 20 ఏళ్ల క్రితం పెళ్లిళ్లలో అమ్మాయి, అబ్బాయి అందరూ చూస్తుండగా మంగళస్నానాలు చేసే పద్ధతి లేదు. పసుపు రాసి స్నానానికి పంపేవారు, లేదా ఓ చెంబు తలమీద పోసి ఊరుకునేవారు. ఇప్పుడు తలమీద పసుపునీళ్లు, పాలు, కొబ్బరినీళ్లు, బీరు, విస్కీ.. అన్నీ పోస్తున్నారు. అదంతా మన సంస్కృతి అంట. ఎవరు ఎవరి సంస్కృతిని తక్కువ చేసినట్లు? ఎవరు ఎవర్ని నెత్తిన పెట్టుకున్నట్లు? గతంలో పెళ్లికి ముందు రోజు పందిరి, పెళ్లి, ఆ తర్వాత రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఉండేవి. ఇప్పుడు హల్దీ అని, మెహందీ అని, బ్యాచిలర్స్ పార్టీ అని, బారాత్ అని, నెత్తిన పగిడీ అని..అన్నీ వచ్చి చేరాయి. ఆ ప్రకారం, సమస్త డబ్బు దండగ కార్యక్రమాలను మనం ఓన్ చేసుకున్నాం. మార్వాడీలకు డబ్బుంది. చేసుకుంటారు. మరి మనకేం మాయరోగం? ఎందుకంత ఖర్చు?

వాళ్లేదో వాళ్ల దగ్గరున్న డబ్బుల్ని ఖర్చుపెట్టి, వాళ్ల సంస్కృతిలో భాగంగా పెళ్లి చేసుకుంటుండగా, మనం అతిథులుగా అక్కడ దూరి, ఆ రంగులు, జిగేలు చూసి చంకలు గుద్దుకొని, మన పెళ్లిళ్లలో బలవంతంగా అవి పాటించేసి, ఈవెంట్ మేనేజర్లకు అవే అలవాటు చేసి, చివరకు ‘తాళి’ని కూడా ‘మంగల్‌సూత్ర్’ అని పిలిచే స్థితికి చేరాక.. ఇప్పుడొచ్చి ‘మార్వాడీలు మన సంస్కృతిలో కలిసిపోలేదు’ అని అంటే ఎవరికి నష్టం? ఎవరిది తప్పు? వాళ్ల సంస్కృతిని మనం నెత్తికెక్కించుకొని ఊరేగాం తప్ప వాళ్లు మన మీద రుద్దారా? తుల్జామాత, భవానీ మాత అని వాళ్లు గుడులు కడితే వెళ్లాం కానీ, మన పోలేరమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ గుళ్లకు వాళ్ల రాకపోకలు గమనించామా? వాళ్లొచ్చి బతుకమ్మ పేర్చడం ఏనాడైనా చూశామా? పోతురాజు గావు పట్టడం, మేక జడ్తి ఇవ్వడం వాళ్లు ఏనాడైనా వచ్చి పరిశీలించారా?

మార్వాడీలు మన సంస్కృతిలో కలవరు. ఇక్కడే కాదు, తమిళనాడు, కేరళ, కర్ణాటక.. ఎక్కడికి వెళ్లినా వారు స్థానిక సంస్కృతిలో కలిసినట్లు కనిపిస్తారు కానీ కలవరు. స్థానిక భాష మాట్లాడినా అది హిందీలాగే వినిపిస్తుంది. అయితే మన తెలుగువాళ్లం మాత్రం మార్వాడీల సంస్కృతిని వదలం. మన చుట్టూ ఉండే మార్కెట్ కూడా దాన్ని వదలనివ్వదు(దానికి డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి). రేపు మన ఇళ్లల్లో పెళ్లిళ్లలో మెహందీకోరోజు, హల్దీకోరోజు పెట్టి గ్రాండ్‌గా వేడుకలు చేస్తాం. మన నలుగును, గోరింటాకును, పారాణిని దూరం పెడతాం. తెలుగు సీరియల్స్‌లో బట్టలు, నగలతో సహా సాంస్కృతికంగా పక్కవాళ్లను కాపీ కొడుతున్న మనకు ‘మీ సంస్కృతి మా మీద రుద్దారు’ అని మార్వాడీలను అనే హక్కు ఉందా, లేదా అని ఒకసారి ఆలోచించుకోండి.

ఆధిపత్య ధోరణి మార్వాడీల ప్రవర్తనలో కాదు, మనలోని ‘మనం తక్కువ..మన సంస్కృతి తక్కువ’ అనే భావనలో ఉంది. అది పోనంతకాలం ఎవరు పోయినా, వచ్చినా ఏమీ మారదు.

Credit : Sai Vamshi