Hyd: వినాయక చవతికే భర్తకు స్పాట్…ఈ చిట్టి మామూల్ది కాదు!

Hyd: వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్యలు చంపేస్తున్న ఘటనలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. తాజాగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కోదండరాం నగర్ రోడ్డు నెం.7లో నివాసం ఉంటున్న జెల్లెల శేఖర్(40), చిట్టి(33)లకు 2009 లో వివాహం అయ్యింది.

చిట్టి స్వస్థలం రంగారెడ్డి జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామం కాగా శేఖర్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం మాధవరం గ్రామం. వీరికి ఓ పాప,బాబు ఉన్నారు. పాప హాస్టల్ లో ఉండి చదువుకుంటుంది. శేఖర్ కారు డ్రైవింగ్ చేస్తుంటాడు. పనిమీద బయటకు వెళ్తే ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. ఈ క్రమంలోనే చిట్టికి హరీష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడగా అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది.

ఇది భర్త శేఖర్ కు తెలియడంతో మందలించాడు. ఇంట్లో పిల్లలున్నారు బాగోదని చెప్పి చూశాడు. అయినప్పటికీ చిట్టిలో మార్పు రాలేదు. పైగా ప్రియుడితో కలిసి ఉండటానికి అడ్డుగా ఉన్నాడని తెగ బాధపడిపోయింది. శేఖర్ ను లేపేస్తేనే హరీష్ తో సుఖంగా ఉండొచ్చని వినాయక చవితి వరకు ఆగింది. పాప హాస్టల్లో ఉంటుంది. వినాయక చవితి కావడంతో బాబు మండపం దగ్గర నిద్రపోతున్నాడు కాబట్టి ఇదే మంచి టైమ్ అనుకుంది.

ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి గురువారం రాత్రి ప్లాన్ ను అమలు చేసింది. భర్త శేఖర్ పడుకున్న తర్వాత ప్రియుడిని పిలిచి ఇద్దరూ కలిసి హత్య చేశారు. ప్రియుడు హరీష్ శేఖర్ గొంతు నులమగా.. చిట్టి డంబెల్ తో తలపై బాదారు. దీంతో శేఖర్ స్పాట్ లోనే చనిపోయాడు. ఉదయం ఏమి తెలియనట్లు నిద్రలోనే భర్త శేఖర్ చనిపోయాడని 100కు ఫోన్ చేసింది చిట్టి.

అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. చిట్టిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న ప్రియుడు హరీష్ కోసం గాలింపు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.