Ghaati : అనుష్క ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఘాటి. చాలా కాలం తర్వాత అనుష్క నటించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కగా రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాను రూపొందించారు.
ఈ సినిమా గంజాయి మాఫియా నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని తూర్పు కనుమలలో గంజాయి సాగు, అక్కడి ప్రజల జీవన విధానం చుట్టూ ఈ కథ అల్లుకుని ఉంటుంది. ఈ సినిమాలో అనుష్క శీలావతి అనే పాత్ర పోషించారు.
అయితే ఈ మూవీకి తెలంగాణ ఈగల్ టీమ్ బిగ్ షాకిచ్చారు. ఘాటి సినిమా ట్రైలర్లో.. మాదకద్రవ్యాల చిత్రీకరణపై ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. సినిమా.. గంజాయి సాగు, రవాణా, వినియోగం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గంజాయితో కూడిన అభ్యంతరకర సీన్స్ లేకుండా మేకర్స్ జాగ్రత్త వహించాలని సూచించింది. NDPS యాక్ట్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. డ్రగ్స్ నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా రేపు విడుదల కానుంది
వాస్తవానికి ఈ సినిమాను మొదట ఏప్రిల్ 18, 2025న, తరువాత జూలై 11, 2025న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడింది. ఇక ఇప్పటికే ఘాటి సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది. కొన్ని హింసాత్మక సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించినట్లు సమాచారం.