khairatabad : ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల సందర్భంగా మహిళా భక్తులతో అసభ్యంగా ప్రవర్తించారు కొంతమంది ఆకతాయిలు. 9 రోజుల్లో మహిళలను వేధించిన 930 మందిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఇందులో 55 మైనర్లు కూడా ఉన్నారు. మిగతావారంతా మేజర్లే.
ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వచ్చే మహిళలను ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి ఆకతాయిల ఆట కట్టించేందుకు తెలంగాణ పోలీసులు మండపం పరిసరాల్లోనే 15 మంది షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు.
ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే.. డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. భక్తి ముసుగులో వచ్చి ఇలాంటి వేధింపులకు పాల్పడితే తోలు తీస్తామని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిపై నిర్భయ చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
గణేష్ నిమజ్జనం వరకు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని నగర పోలీసులు స్పష్టం చేశారు. ఎవరైనా ఆకతాయిల వేధింపులకు గురైతే వెంటనే డయల్ 100కు గానీ, స్థానిక షీ టీమ్స్‌కు గానీ సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.