Nara Lokesh: టీడీపీలోకి కవిత.. నారా లోకేష్ సంచలన కామెంట్స్!

Nara Lokesh: తెలంగాణ ఎమ్మెల్సీ కవితపై ఏపీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో కవిత చేరికపై ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కవితను టీడీపీలో చేర్చుకోవడం అంటే … జగన్‌ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిదే-నని అన్నారు. తాను వివిధ సందర్భాల్లో కేటీఆర్ ను చాలా సార్లు కలిశానని, కలిస్తే తప్పేంటని లోకేష్ అన్నారు. కేటీఆర్‌ను కలవాలంటే రేవంత్‌రెడ్డిని అడగాలా అని ప్రశ్నించారు.

ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చంద్రబాబు త్వరలో నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తెలంగాణపై టీడీపీ ఫోకస్ చేశామని తెలిపారు. కాగా ఇటీవలే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై పార్టీ ఆమెను సస్పెండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్‌కు, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. ఈ క్రమంలో కవిత టీడీపీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం సాగింది. దీంతో ఆ ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు లోకేష్.

కాగా హరీష్ రావు, సంతోష్ రావు వంటి నాయకుల కారణంగానే కేసీఆర్ పై అవినీతి మరకలు అంటాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరూ ఒకే విమానంలో ప్రయాణించారని, అప్పటినుంచే ఆమెపై కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి కవిత మద్దతు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా తెలుగువారంతా సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు.