Mirai : మిరాయ్.. తెలుగు ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన పాఠం

Mirai : మిరాయ్ అనేది ఒక చందమామ కథ లాంటి సినిమా.. చందమామల కథ మనము చదివి ఊహించుకుంటాము.. ఇది మన కళ్ళ ముందర ఒక అద్భుత చిత్రాన్ని చిత్రీకరిస్తుంది.. హనుమాన్ , పురాణాల ఫిక్షన్ సినిమాలు చూసే వాళ్లకు ఇది నచ్చుతుంది. అది తక్కువ ఖర్చుతో అద్భుతమైన VFX గ్రాఫిక్స్ తో ఈ సినిమా అంచనాలును అందుకుంది. ఈ సినిమా 50 కోట్లతో తీశారు అంటే నమ్మలేరు.. ఈ మధ్యన ఇటువంటి సినిమాలకు 200 కోట్లు ఖర్చయింది 300 కోట్లు ఖర్చయిందని వారం రోజుల సినిమా టికెట్లు పెంచుకొని బొక్క బోర్లా పడ్డ తెలుగు ఇండస్ట్రీకి ఈ చిత్రం ఒక అద్భుతమైన పాఠం చెబుతుంది..

పాన్ ఇండియా అంటే రకరకాల యాక్టర్లు రకరకాల భాషల నుంచి తీసుకొని కలగాపులగంగా తీస్తే పాన్ ఇండియా అవుతుంది అని భ్రమించిన కన్నప్ప, కూలి సినిమాలకు ఇది ఒక పాఠం చెప్తుంది.. పాన్ ఇండియా అంటే కేవలం అన్ని భాషలలో ఉన్న వ్యక్తులు తీసుకోవడం కాదు.. పాన్ఇండియా అంటే మొత్తం భారతదేశం కనెక్ట్ అయ్యే ఒక పాయింట్ ను తీసుకోవాలి… జైశ్రీరామ్, రామ మందిరం అనేది అద్వానీ చేసిన నినాదం ద్వారా అది ఒక భారతదేశం అంతా కనెక్ట్ అయ్యే సబ్జెక్టు.. దానిని హనుమాన్ చిత్రంలోను ఇందులోనూ దర్శకుడు ఉపయోగించుకున్నాడు. లోకేష్ కనకరాజ్ కు ఈ విషయం తెలియక కూలి సినిమాలో కొంచెం తడబడ్డాడు..

ఇటువంటి సినిమాలో హిట్ అవడం వలన చాలామంది ఇకపైన ఆ యాక్టర్లకు మాత్రమే అన్నన్ని కోట్లు పెట్టి దానిని రూ.200, 300 కోట్లతో తీసే బదులు.. పాత్రలను బట్టి యాక్టర్, అంతేకానీ యాక్టర్లను బట్టి పాత్రలు కథను వండకూడదని తెలుసుకోవాలి.. ఇటువంటి చందమామ కథలు అన్ని దేశాలలో అన్ని సంస్కృతులలో ఉన్నాయి కాబట్టి ఇది అభూత కల్పనలా ఉన్న కానీ ఒక అందమైన కంటెంట్ తో మన దేశంలో అందర్నీ అలరిస్తుంది..

కళింగ యుద్ధంలో అశోకుడు చాలామంది చనిపోయిన తర్వాత అతనిలో పరివర్తన కలిగి ఈ శక్తి వల్ల నాకు ఇలా జరిగింది కావున ఈ శక్తిని 9 పుస్తకాలుగా చేసి వాటిలో నిక్షిప్తం చేస్తాడు.. ఆ తొమ్మిది పుస్తకాలు ఎవరైతే సేకరిస్తారో వాడికి అతీంద్రియ శక్తులు కలుగుతాయి.. ఆ తొమ్మిది పుస్తకాలను సేకరించి ఆ మానవాతీత శక్తిని కైవసం చేసుకోవడానికి ఒకడు బయలుదేరుతాడు.. వాడిని నిలవరించడానికి ఇంకొక శక్తి పుడుతుంది.. అది ఎలా దానిని నిలవరిస్తుంది అనేది చిత్రం..

దీనికి రామాయణము తో సంబంధం ఉన్న సంపాతి జటాయువు, శ్రీరాముని కోదండాన్ని చిత్రానికి కలుపుతారు.. ఈ చిత్రాన్ని కోడిగుడ్డు మీద ఈకలు తీసే కంటే కేవలం ఒక చందమామ కథగా చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది.. (లేకపోతే బౌద్ధానికి బ్రాహ్మణ్యానికి ముడిపెట్టినట్లు, అశోకుడు కేవలం ఒక రాజే అతనికి మానవాతీతమైనశక్తులు ఉండడం ఏంటి వాటిని 9 పుస్తకాలలో పెట్టడం ఏంటి.. అనే విధంగా చూస్తే ఈ సినిమా నచ్చదు..అయినా ఈ కాలంలో ఇటువంటి నిజం అని నమ్మే వాళ్ళు ఎవరూ లేకపోయినా కానీ రజనీకాంత్ లాంటి పెద్ద యాక్టర్ హిమాలయాలలో ఏదో రహస్యం ఉంది అని హిమాలయాలలో కొన్ని సంవత్సరాలు తిరుక్కుంటూ ఉన్నాడు చివరికి అక్కడ ఏమీ లేదు మనం తెలుసుకోవాల్సింది మనలోనే ఉంది అని గమనించి ఇక ఇంటి దారి పట్టి మరలా సినిమాలు తీసుకుంటున్నాడు…)

ఇది చందమామ కధ లాంటి చక్కని అద్భుత కల్పనతో నిర్మించిన ఓ అత్యద్భుతమైన గ్రాఫిక్స్ కలిగిన ఓ చలనచిత్రం అంతే.. కాకపోతే శ్రీరాముని ధనుస్సు అనే సెంటిమెంటుతో భారతదేశంలో ఉండే అందరిని కట్టిపడేస్తారు.. అదే మార్కెటింగ్ టెక్నిక్.. ఎక్కువ సెంటిమెంట్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరమేం లేదు… అది ఒక అద్భుతమైన అభూతకల్పనగల చలన చిత్రం…అంతే… ఈ కాన్సెప్ట్ తో చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ ఆనందాన్ని పంచుతుంది. నచ్చుతుంది.