Pakistan : ట్రంప్ పరువు తీసిన పాకిస్తాన్ మంత్రి..ఇజ్జత్ పోయిందిపో

భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందంటూ చాలా వేదికలపై ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ గొప్పగా చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అవన్ని ఉత్తవేనని స్వయంగా పాక్ మంత్రినే తేల్చేశారు.

 

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇటీవల ఒక ప్రకటనలో మాట్లాడుతూ .. భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ చర్చలలో మూడవ పక్షం జోక్యాన్ని భారత్ ఎన్నడూ అంగీకరించలేదని ఆయన స్పష్టం చేశారు.

ఇషాక్ దార్ ప్రకటనతో డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలను పటాపంచలు చేసినట్లు అయింది. కాల్పుల విరమణ కోసం అమెరికా ద్వారా ఒక ప్రతిపాదన వచ్చినప్పటికీ భారత్ దీనిని అంగీకరించలేదని ఇషాక్ దార్ వెల్లడించారు. భారత్ ఎల్లప్పుడూ ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని పట్టుబట్టిందని ఆయన తెలిపారు.

ఇషాక్ దార్ చేసిన ఈ వ్యాఖ్యలతో, భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపనలో అమెరికా మధ్యవర్తిత్వం ఏ మాత్రం లేదని, ట్రంప్ వాదనలు సరికాదని నిరూపించాయి. ఇక తాము భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, అయితే భారత్ వైపు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని దార్ చెప్పుకొచ్చారు.

అయితే, ఏవైనా చర్చలు జరగాలంటే ఉగ్రవాదం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ జమ్మూ కాశ్మీర్ వంటి అన్ని అంశాలను సమగ్రంగా చర్చించాలన్నారు దార్.  మొత్తానికి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చేసిన ఈ కామెంట్స్ ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారంలో మూడవ పక్షం పాత్ర లేదని తేల్చేశాయి. ఇకనైనా ట్రంప్ ఈ పాట మాట చెప్పడమైనా మానేస్తారో లేదో చూడాలి.