Kerala : 16 ఏళ్ల బాలుడిపై 14 మంది అత్యాచారం…నిందితుల్లో పొలిటికల్ లీడర్!

Kerala : కేరళలో దారుణం జరిగింది. 16 ఏళ్ల ఓ బాలుడిపై ఓ పొలిటికల్ లీడర్ తో పాటుగా మరో 13 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. కాసరగోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ కేసులో ఎనిమిది మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డేటింగ్ యాప్ ద్వారా ఆ బాలుడిని వీరంతా కలిశారని చెబుతున్నారు.

ఈ లైంగిక వేధింపులు రెండేళ్లలో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలకు సంబంధించి విద్యా శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి, రైల్వే రక్షణ దళానికి చెందిన ఒక సీనియర్ అధికారి, ఒక రాజకీయ నాయకుడితో సహా మొత్తం 14 మందిపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు.

వీరిలో ఎనిమిది మంది నిందితులను ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు.పోలీసుల దర్యాప్తులో నిందితులు ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా బాలుడితో స్నేహం చేశారని తేలింది. సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్న తర్వాత, వారు బాలుడిని కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు.

ఆ బాలుడు నిందితులచే అనేక సందర్భాల్లో లైంగిక దోపిడీకి గురయ్యాడని పోలీసులు తెలిపారు. అత్యాచారం జరిగిన తర్వాత నిందితులు ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు అతనికి డబ్బులు కూడా చెల్లించారని పోలీసులు వెల్లడించారు. అయితే ఒకరోజు ఆ బాలుడి తల్లి తన ఇంట్లో ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఆమెను చూడగానే ఆ వ్యక్తి పారిపోయాడు. అనుమానంతో ఆమె తన కొడుకును నిలదీసింది. బాలుడు జరిగిదంతా చెప్పడంతో వెంటనే ఆమె చందేరా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఆ పొలిటికల్ లీడర్ ఎవరనే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో ఈ ఘటన సంచలనంగా మారింది.