OG Movie : ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించనున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. ‘ఓజీ’ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి విడుదలైన ఒక్కో కంటెంట్, ఆ అంచనాలను పెంచుతూ వచ్చింది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం కోసం అందరూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
ఆదివారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని ఎల్.బి. స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “సినిమాల్లో వేసుకునే కాస్ట్యూమ్స్ తో నేనెప్పుడూ ఇలాంటి వేడుకలకు హాజరుకాలేదు. దర్శకుడు సుజీత్ వల్ల, మొదటిసారి ఇలా సినిమా కాస్ట్యూమ్స్ తో వచ్చాను. ఇదంతా అభిమానుల కోసమే. ‘వాషి యో వాషి’ అనేది జపనీస్ హైకూ(పద్యం). “నువ్వు అందనంత ఎత్తులో ఉన్నావు. నిన్ను నేలకు దించుతాను” అని విలన్ కి హీరో తెలియజేసే సందర్భంలో ఈ హైకూ వస్తుంది. ఓజీతో పెట్టుకుంటే మరణం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ పాట ద్వారా చెప్పడం జరిగింది. ఇమ్రాన్ హష్మీ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ‘జలక్ తిక లాజ’ అంటూ అప్పట్లో ఉర్రుతలూగించారు. ఆయన అద్భుతమైన నటుడు. సుజీత్ నా వీరాభిమాని. జానీ సినిమా సమయంలో చాలా రోజులు హెడ్ బ్యాండ్ కట్టుకొని తిరిగానని నాతో చెప్పాడు. సినిమా మీద పిచ్చితో ఇక్కడిదాకా వచ్చాడు. సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ .. దర్శకుడు సుజీత్ తో మీరు సినిమా చేస్తే బాగుంటుందని, దానయ్య ద్వారా నాకు పరిచయం చేశారు.
సుజీత్ కథ చాలా సింపుల్ గా చెప్తాడు. కానీ, సినిమా తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది. నేను కాకుండా ఈ సినిమాకి ఇద్దరు స్టార్లు ఉన్నారు. మొదటి స్టార్ దర్శకుడు సుజీత్. రెండో స్టార్ సంగీత దర్శకుడు తమన్. వీళ్ళిద్దరూ ఈ సినిమా కోసం పిచ్చిగా పనిచేశారు. ఈ సినిమా కోసం వీళ్ళు ఒక మాయలోకి వెళ్ళిపోయి, ఆ మాయలోకి నన్ను కూడా తీసుకెళ్లారు. ఈ సినిమాలోని ప్రతి అంశం మిమ్మల్ని రంజింపజేసేలా ఉంటుంది. రవి కె చంద్రన్ , మనోజ్ పరమహంస అద్భుతమైన విజువల్స్ అందించారు. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో 80ల నాటి హీరోయిన్ లా కనిపిస్తారు. సినిమాలో మా ఇద్దరి మధ్య అనుబంధం తక్కువసేపే ఉన్నప్పటికీ, చాలా హృద్యంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుండు అనిపిస్తుంది. తక్కువ నిడివిలో అంత చక్కటి ప్రేమకథను చూపించాడు సుజీత్.
వెండితెరపై కవిత్వం రాసినంత అందంగా రవి చంద్రన్ విజువల్స్ ఉంటాయి. ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురుచూస్తున్నారు. నేను ఖుషి అప్పుడు చూశాను ఈ జోష్. అలాంటి జోష్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. సినిమాలు వదిలేసి నేను పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయినా, మీరు నన్ను వదల్లేదు అనిపిస్తుంది. మీరే నాకు భవిష్యత్ ఇచ్చింది. మీరిచ్చిన బలంతోనే ఇప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నాను. నేను సినిమా ప్రేమికుడిని. సినిమా చేసేటప్పుడు, సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదు. అలాగే పాలిటిక్స్ చేసేటప్పుడు, పాలిటిక్స్ తప్ప వేరే ఆలోచన ఉండదు. సినిమా చేసేటప్పుడు.. సినిమా ఎంత బాగా చేయాలి, దర్శకుడు చెప్పింది ఎంత బాగా చేయాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. నాకు జపనీస్ తెలీదు. ఈ సినిమా కోసం నేర్చుకున్నాను. సుజీత్ డైరెక్షన్ టీంకి నా ప్రత్యేక అభినందనలు. నేను డైరెక్షన్ చేసే సమయంలో ఇలాంటి టీం ఉండుంటే.. నేను పాలిటిక్స్ లోకి వచ్చి ఉండేవాడిని కాదేమో. తమన్ టీం కూడా అద్భుతంగా పని చేసింది. ఈ సినిమాలో ర్యాప్ పాడింది మన తెలుగువాళ్లే. తెలుగు వాడంటే ఉరుముతుంది ఆకాశం. శ్రియా రెడ్డి గారు అద్భుతమైన నటి. కరెక్ట్ గా చెప్పాలంటే సివంగి. భవిష్యత్ లో ఆమెతో కలిసి పని చేస్తానని మాట ఇస్తున్నాను.” అన్నారు.