Donald Trump : మారని ట్రంప్.. మళ్లీ అదే జోకుడు

Donald Trump : ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (UNGA) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కేవలం ఏడు నెలల కాలంలో తాను ఏడు అంతులేని యుద్ధాలను ఆపానని అన్నారు. ఈ యుద్ధాలు కొన్ని 30 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఏడు యుద్ధాలలో భారత్, పాకిస్థాన్‌తో సహా కంబోడియా-థాయ్‌లాండ్, కొసావో-సెర్బియా, కాంగో-రువాండా, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్-ఇథియోపియా, ఆర్మేనియా-అజర్‌బైజాన్ మధ్య ఘర్షణలు ఉన్నాయని ఆయన తెలిపారు.

భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తాను ఎలా ఆపింది వివరించారు. ఈ రెండు అణ్వాయుధ దేశాలు యుద్ధం వైపు వెళ్తున్నాయని, తాను జోక్యం చేసుకోకుంటే అణు యుద్ధం జరిగేదని ట్రంప్ అన్నారు. ఏడు యుద్ధాలను ముగించడంలో తన పాత్ర ఉందని చెప్పుకున్న ట్రంప్, ఐక్యరాజ్యసమితిపై విమర్శకులను దిగారు. యుద్ధాలను పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి దేనికీ సహాయం చేయడానికి ప్రయత్నించలేదని అన్నారు.

ఖాళీ మాటలు యుద్ధాలను పరిష్కరించవని ట్రంప్ కామెంట్స్ చేశారు. యుద్ధాలను ఆపడానికి ప్రతి దేశ నాయకులతో మాట్లాడానని, కానీ ఐక్యరాజ్యసమితి నుండి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదన్నారు.ఐక్యరాజ్యసమితి తన ప్రాముఖ్యతను కోల్పోయిందన్నారు. ప్రపంచదేశాల్లో అమెరికాపై గౌరవం పెరిగిందన్నారు ట్రంప్. టారిఫ్‌లు, H1B వీసాలపై నిర్ణయాలు.. అమెరికా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాయని తెలిపారు.

అయితే ట్రంప్ పదేపదే చేస్తున్న ఈ వాదనను భారత్ అనేకసార్లు ఖండిస్తూ వచ్చింది. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తమ ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారానే జరిగిందని, ఇందులో ఏ మూడో పక్షం జోక్యం చేసుకోలేదని భారత్ స్పష్టం చేసింది. అంతేకాకుండా పాక్ విదేశాంగశాఖ మంత్రి కూడా ఇదే చెప్పారు. అయినప్పటికీ ట్రంప్ అదేమాట చెబుతున్నారు.