Vladimir Putin : ఉక్రెయిన్ కు అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులను సరఫరా చేయనుందన్న వార్తల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తొమహాక్ క్రూయిజ్ క్షిపణులను అమెరికా.., ఉక్రెయిన్ కు సరఫరా చేస్తే అది ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని పుతిన్, ట్రంప్ ను హెచ్చరించారు.
క్షిపణుల సరఫరాతో యుద్ధ భూమిలో పరిస్థితులు మారబోవని తెలిపారు. తమ సైనికులు స్థిరంగా ముందుకు చొ చ్చుకొని వెళుతూనే ఉంటారని చెప్పారు. తొమహాక్ క్షిపణుల అడ్డుకునేలా తమ గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. అదే సమయంలో ఉక్రెయిన్ తో శాంతి చర్చలకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ ప్రశంసించారు.
ఆగస్టులో అలస్కాలో ట్రంప్ తో జరిగిన సమావేశం సానుకూలంగా జరిగిందని చెప్పారు. తమ చమురు నౌకలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రతి చర్య తప్పదని పశ్చిమ దేశాలను హెచ్చరించారు. డెన్మార్క్ లో డ్రోన్ల కదలికలపై రష్యా ప్రమేయం ఉందన్న నాటో కూటమి ఆరోపణలను పుతిన్ తోసిపుచ్చారు.