Amir Khan Muttaqi : అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ వచ్చే వారం భారత్ లో పర్యటించనున్నారు. ఈ నెల 10 నుంచి అమీర్ ఖాన్ భారత పర్యటన మెుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. తాలిబన్లు అఫ్గాన్ ను చేజిక్కించుకున్న తర్వాత అక్కడి నాయకత్వం భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి అని అధికార వర్గాలు తెలిపాయి.
వాస్తవానికి గత నెలలోనే అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే తాలిబన్ నేతల విదేశీ ప్రయాణాలపై ఐరాస భద్రతా మండలి ఆంక్షల కారణంగా అది రద్దయింది. గత నెల 30న విదేశీ ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని భద్రతా మండలి తాత్కాలికంగా ఎత్తివేయటంతో… అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్ పర్యటనకు మార్గం సుగమమైంది.
అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గాన్ లో తాలిబన్లు పాలన మొదలు పెట్టినప్పటికీ… భారత్ సహా అనేక దేశాలు అక్కడి ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. అయితే భారత్ మాత్రం అఫ్గాన్ లో దౌత్యకార్యకలాపాలు కొనసాగిస్తోంది.
ఈ ఏడాది మేలో అమీర్ ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్… ఫోన్ లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని స్వాగతించారు.