chiranjeevi : పసివాడి ప్రాణం సినిమా వెనుక ఈ విషయాలు మీకు తెలుసా?

chiranjeevi

chiranjeevi : ఒక సినిమా కోసం వ్రాసిన కధ ఆరు భాషల్లో సినిమాలకు పనికొచ్చిందంటే ఆ రచయితను తప్పకుండా అభినందించాల్సిందే . ఆ ఘనత మళయాళ సినీ రంగానికి సంబంధించిన ఫాజల్ అనే రచయిత కం దర్శకుడికే చెందుతుంది . పూవిన్ను పుదియ పూంతెన్నాల్ అనే మళయాళ సినిమాకు ఫాజల్ కధను వ్రాసి ఆయనే దర్శకత్వం వహించారు . మమ్ముట్టి , సురేష్ గోపి , నదియా ప్రభృతులు నటించారు . ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయటానికి అల్లు అరవింద్ హక్కులు కొనుక్కొని బావ చిరంజీవితో పసివాడి ప్రాణం అనే టైటిలుతో రీమేక్ చేసారు . ఈ టైటిల్ కూడా అరవిందే పెట్టారట . చిరంజీవి స్టార్డంకు అనుకూలంగా క్లైమాక్సును శుభాంతం చేసారు . మళయాళంలో హీరో చనిపోతాడు . మన తెలుగులో హీరో చిరంజీవి చిరంజీవి కదా ! శుభాంతం చేసి బ్లాక్ బస్టర్ని చేసారు . కనక వర్షం కురిసింది .

చిరంజీవి , కోదండరామిరెడ్డిల కాంబినేషన్లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ ఈ పసివాడి ప్రాణం.చిరంజీవి బ్రేక్ డాన్స్ , విజయశాంతి వయ్యారాలు , సుమలత ముగ్ధ మనోహర రూపం , పసివాడి సెంటిమెంట్ , చక్రవర్తి సంగీతం , తార కొరియోగ్రఫీ , కోదండరామిరెడ్డి పాటల చిత్రీకరణ , దర్శకత్వం ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేసాయి. జంట హత్యల్ని చూసిన నోరు , వినికిడి శక్తి లేని ఓ పసివాడిని చంపటానికి ఇద్దరు విలన్లు వెంటాడుతుంటారు . ఆ పసివాడు అదృష్టవశాత్తూ హీరో చేతిలో పడతాడు . హీరో ప్రేమతో కాపాడుకుంటూ విలన్ల కొరకు ప్రయత్నిస్తూ ఉంటాడు . ఈ ప్రయత్నంలో అతని ప్రేయసి విజయశాంతి కూడా సాయపడుతూ ఉంటుంది . ఆ పసివాడు తన అక్క కొడుకు అని కూడా తెలుస్తుంది . హీరోనే హత్యల్ని చేసాడని నమ్మిన పోలీసు ఇనస్పెక్టర్ అతన్ని అరెస్ట్ చేస్తాడు . కస్టడీ నుండి తప్పించుకుని విలన్లను తుదముట్టించటంతో శుభం కార్డ్ పడుతుంది .

ఇది కూడా 1+2 సినిమాయే . అయితే ఒకరి తర్వాత ఒకరు ఎంటరవుతారు . చిరంజీవి యాక్షన్ ప్రేక్షకులను కదలనివ్వదు . విజయశాంతి , సుమలతల గ్లామర్ సినిమాకు గ్లామర్ ని తెచ్చింది . ముఖ్యంగా మెచ్చుకోవలసింది పసివాడిగా నటించిన బేబీ సుజిత . ఎందుకనో టైటిల్సులో మాస్టర్ అని వేసారు . పెద్దయ్యాక ఈ బేబీ సుజిత పెద్ద టివి నటి అయింది . జై చిరంజీవ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కూడా నటించింది . విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రసయిన కన్నడ ప్రభాకర్ సిన్సియర్ పోలీసు ఇనస్పెక్టరుగా నటించటం విశేషం . రఘువరన్ , అతని అనుచరుడుగా నటించిన బాబు ఇద్దరికీ తెలుగులో ఇదే మొదటి సినిమా . ఇద్దరూ చాలా బాగా నటించారు . ఇతర పాత్రల్లో ప్రసాద్ బాబు , అల్లు రామలింగయ్య , రాజ్యలక్ష్మి , జగ్గయ్య , గుమ్మడి , గిరిబాబు , పి జె శర్మ , ప్రభృతులు నటించారు .

ప్రత్యేకంగా చెప్పుకోవలసింది పాటలు . ఆత్రేయ , వేటూరిలు పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మలు పాడారు . సుమలతతో ఒక డ్యూయెట్ అందం శరణం గఛ్ఛామి అధరం శరణం గఛ్ఛామి నిజంగానే అందంగా ఉంటుంది . చిరంజీవి ఎంట్రీ సాంగ్ సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం హుషారుగా సాగుతుంది . విజయశాంతితో మూడు డ్యూయెట్లు ఇద్దరూ అదరగొట్టేసారు . కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామా , ఇదేదో గోలగా ఉంది , చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్ అంటూ సాగుతాయి ఈ మూడు డ్యూయెట్లు . ఇద్దరూ బ్రేక్ డాన్స్ అద్భుతంగా ఉంటుంది.

1987 జూలై 23 న విడుదలయిన ఈ సినిమా డైరెక్టుగా, షిఫ్టింగులతో 30 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది తిరుపతిలో సిల్వర్ జూబిలీ అడింది . ఒకటి రెండు చోట్ల మార్నింగ్ షోలతో 300 రోజులు అడింది . తెలుగు తర్వాత తమిళంలో సత్యరాజుతో , కన్నడంలో అంబరీషుతో , హిందీలో గోవిందాతో రీమేక్ అయింది . బంగ్లాదేశీ , సింహళీసులో కూడా రీమేక్ అయింది . బేబీ సుజిత అన్ని భారతీయ భాషల్లోనూ నటించిందట . ఈ బ్లాక్ బస్టర్ సినిమా.

Credit :Subramanyam Dogiparthi