Australia : రోకో ఫెయిల్..టీమిండియాకు చుక్కలు చూపించారు!

roko

Australia : భారత్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది ఆస్ట్రేలియా. వర్షం కారణంగా మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.అయితే DLS కారణంగా, ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు, 5 పరుగులు తగ్గించారన్న మాట. కంగారూలు ఈ స్వల్ప లక్ష్యాన్ని 21.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేశారు.

131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా తొలి దశలోనే తడబడింది. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ కేవలం 8 పరుగులకే ఔటయ్యాడు. అయితే కెప్టెన్ మిచెల్ మార్ష్ మ్యాచ్ ను విజయతీరానికి తీసుకువెళ్లాడు. మార్ష్ 52 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 46 పరుగులు సాధించాడు. అతనికి తోడుగా రెన్‌షా 24 బంతుల్లో 21 పరుగులు చేశాడు. దీంతో మరో 7 వికెట్లు ఉండగానే ఆసీస్ విక్టరీ కొట్టింది. భారత్ తరపున అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

కేవలం 136 పరుగులు మాత్రమే

ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం 136 పరుగులు మాత్రమే చేసింది. 7 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (0) సింగిల్ ఫిగర్స్ వద్ద అవుట్ కాగా, గిల్ కేవలం 10 పరుగులకే అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా కేవలం 24 బంతుల్లో కేవలం 11 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు. 5వ వికెట్ కు జతకట్టిన రాహుల్, అక్షర్ పటేల్ 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు స్కోరును 100 పరుగుల మార్కును దాటించారు.

అక్షర్ పటేల్ 38 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేయగా, రాహుల్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి 25వ ఓవర్లో అవుట్ అయ్యాడు. చివరికి, నితీష్ కుమార్ రెడ్డి 11 బంతుల్లో 2 సిక్సర్లతో 19 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కునెమన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్, నాథన్ ఎలిస్‌కు చెరో వికెట్ దక్కింది. ఇక రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్‌లో జరుగుతుంది.