Ameerpet : 4 రోజుల్లో రూ. 3 లక్షలు .. శవానికి ట్రీట్‌మెంట్‌!

Ameerpet

Ameerpet : ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బుల కోసం చనిపోయిన రోగులకు కూడా చికిత్స ట్రీట్‌మెంట్‌అందిస్తున్న నటించి, భారీగా బిల్లులు వసూలు చేస్తున్న అనేక సంఘటనలను ఇప్పటివరకు మనం చాలానే చూశాం. హైదరాబాద్ లోని గచ్చిబౌలి, అమీర్‌పేట్, మియాపూర్, కేపీహెచ్‌బీ వంటి ప్రాంతాల్లోని పలు కార్పొరేట్ ఆసుపత్రులు, అనంతపురం, హన్మకొండ వంటి ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు తరచుగా వార్తలలో నిలిచాయి. తాజాగా అమీర్‌పేట్‌లోని వెల్‌నెస్‌ హాస్పిటల్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. చనిపోయిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నట్లు నమ్మించి లక్షల్లో హాస్పిటల్‌ యాజమాన్యం వసూలు చేసిందన్న ఆరోపణలున్నాయి.

మృతదేహాన్ని ఇవ్వకుండా హాస్పిటల్‌ యాజమాన్యం దౌర్జన్యానికి దిగింది. రూ.60 వేలు కడితేనే మృతదేహం ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడిందని బాధితులు అంటున్నారు. 4 రోజుల్లో రూ. 3 లక్షలు కట్టించుకున్న వెల్నెస్ యాజమాన్యం.. మరో రూ.60 వేలు కట్టించుకున్నాక పేషంట్ చనిపోయారని చావు కబురు చల్లగా చెప్పింది. లంగ్ ఇన్ఫెక్షన్ తో పుష్పలత అనే పేషంట్ ఈ ఆసుపత్రిలో జాయిన్ అయింది. హాస్పిటల్ లో జాయిన్ అయ్యాక కిడ్నీ ఫెయిల్, లివర్ డ్యామేజ్ అయిందని.. డబ్బులు గుంజారు వెల్నెస్ యాజమాన్యం.

అంతా సెట్ అయింది అని నమ్మించి..ఆ మరుసటి రోజే వెంటి లెటర్ పైకి షిఫ్ట్ చేశారు. అనంతరం చనిపోయారని చెప్పారు డాక్టర్లు. ఉన్న డబ్బులు ఖర్చు చేశాం..బాడీ అప్పగించాలని కోరిన హాస్పిటల్ యాజమాన్యం కనికరించలేదని బాధితులు అంటున్నారు. ఇంకా రూ.60 వేలు ఇస్తేనే డెడ్‌బాడీని ఇస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

గతంలోనూ వెల్‌నెస్‌ హాస్పిటల్‌పై ఇలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు కూడా ఉన్నాయి.గతంలో ఇదే ఆసుపత్రిలో ఒక బాలింత మృతి చెందడంపై కూడా బంధువులు ఆందోళన చేసి, ఆసుపత్రి అద్దాలను పగలగొట్టారు. గతేడాది ఆనారోగ్య సమస్యలతో రాజయ్య అనే వృద్దుడు ఇదే హాస్పిటల్‌లో చేరాడు. అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే అతను చనిపోయాడని బంధువులు ఆందోళనకు దిగారు.