Konda Surekha : తలొగ్గిన సురేఖ..సీఎం రేవంత్ కు క్షమాపణలు

Konda Surekha : ఎట్టకేలకు బీసీ మంత్రి కొండా సురేఖ తలొగ్గారు. తన కూతురు కొండా సుస్మిత చేసిన తప్పుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆమె క్షమాపణలు చెప్పారు. సీఎం రేవంత్ పై తన కూతురు చేసిన ఆరోపణలు, తన శాఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ వ్యవహారంపై ఆమె స్పందించారు. గురువారం క్యాబినెట్‌ భేటీ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎంకు క్షమాపణలు చెప్పారు.

తన ఇంటికి పోలీసులు రావడంతో తన కూతురు ఆవేశంతో మాట్లాడిందని .. అందుకు సీఎంకు తన కూతురు తరుపున తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అంతేతప్ప తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు సురేఖ. కాంగ్రెస్‌ ఒక కుటుంబమని, టీ కప్పులో తుఫాను మాదిరిగా గొడవలు వస్తాయని చెప్పుకొచ్చారు. మిస్ అండర్ స్టా్ండిగ్ తోనే గొడవలు జరిగాయన్నారు. ఈ విధంగా గత కొద్ది రోజులుగా నడిచిన వివాదానికి తెరపడినట్లు అయింది.

తమ తల్లి, బీసీ మహిళా మంత్రి కావడంతో ఆమెను రాజకీయంగా అణగదొక్కేందుకు పార్టీలోని రెడ్డివర్గం నాయకులు కుట్ర పన్నుతున్నారని కొండా సుస్మిత ఆరోపించారు. రెడ్లంతా ఒక్కటయ్యారు బీసీలను తొక్కేస్తున్నారు అంటూ ఘాటైన రాజకీయ విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి ఈ కుట్ర వెనుక ఉన్నారని ఆమె స్పష్టంగా పేర్లు ప్రస్తావించారు.

సీఎం బ్రదర్స్ భూములు అక్రమించుకోవాలని చూస్తున్నారని, అందుకు సీఎం రేవంత్ రెడ్డి వారికి సహకరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ తల్లిదండ్రులకు ఏమైనా హాని జరిగినా, దానికి సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి, వేం నరేందర్ రెడ్డిలదే పూర్తి బాధ్యత అని ఆమె హెచ్చరించారు. ఈ ఆరోపణల కారణంగానే తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.