BUS Fire Accident : కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆతర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి.
మంటలు చెలరేగడంతో 20 మంది ప్రయాణికులు చనిపోగా, 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది.బస్సు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ప్రమాదానికి ప్రాధమికంగా 7 కారణాలు గుర్తించారు.
1. బస్సును బైక్ ఢీకొట్టడం
2. బస్సు బైక్‌ను ఈడ్చుకెళ్లడం
3. ఫ్యూయల్ ట్యాంక్‌లో మంటలు రావడం
4. ప్రమాద తీవ్రతను డ్రైవర్ అంచనా వేయకపోవడం
5. మంటల్ని ఆర్పేందుకు విఫలం అవడం
6. ప్రయాణికుల్ని అలెర్ట్ చేయకపోవడం
7. మంటలను ఫైర్ సేఫ్టీ కిట్ తో కాకుండా నీళ్లతో ఆర్పే ప్రయత్నం
సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు.సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలన్నారు. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
