Bus Accident: కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘోర దుర్ఘటనలో సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. బస్సు అతివేగంగా వచ్చి ఒక బైక్‌ను ఢీకొట్టింది. బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు ఆగకుండా దాన్ని 300 మీటర్లు వరకు లాక్కెళ్లిపోయింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి స్పాట్ లోనే చనిపోయాడు.
మృతుడిని శివశంకర్ గా పోలీసులు గుర్తించారు. కర్నూలు మండలం ప్రజానగర్ కు చెందిన శివశంకర్ .. గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసేవాడు. నిన్న తెల్లవారుజామున డోన్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదంలో చిక్కుకున్నాడు. శివశంకర్ చనిపోయాడు అని తెలియగానే అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని గుండెలు పగిలేలా రోదించారు. తాను బతికి ఉండగానే కన్న బిడ్డ ఇలా విగతజీవిగా కనిపించడం చూసి యశోద తలపట్టుకుని విలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన నెటిజన్లు కూడా కన్నీళ్లు పెట్టిస్తుంది.
Bus Accident : శంకరా ఎంత పనిచేశావ్రా.. గుండె పగిలేలా రోదిస్తున్న తల్లి- VIDEO pic.twitter.com/s0s0UQ7t6Y
— kotlata (@kotlataweb) October 24, 2025
కావేరి ట్రావెల్స్ బాగోతం!
ట్రాఫిక్ చలాన్లలో వేమూరి కావేరి ట్రావెల్స్ బాగోతం బయటపడింది. ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలోనే 16 చలాన్లు ఉన్నాయి. బస్సు నెంబర్(DD01N9490)పై మొత్తం 23,120/- ఫైన్లు ఉన్నాయి. 2024 జనవరి నుంచి 2025 అక్టోబరు వరకు 16 చలాన్లు ఉండగా.. 9 సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి ప్రవేశించింది బస్సు. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలపైనా చలాన్లు ఉన్నాయి.
ఇక ఈ ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ గడువు కూడా ముగిసింది. ఇన్సూరెన్స్ పాలసీ గతేడాదితో పూర్తి అయింది. టాక్స్ కూడా గతేడాదితో ముగిసింది. పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా గత ఏడాదికి ఎక్స్పైర్ అయిపోయింది. కర్నూల్ శివారులో తెల్లవారుజామున బైక్‌ను ఢీకొట్టిన బస్సు.. బైక్‌ను 300 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. 20 కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది ఈ ట్రావెల్స్ బస్సు.
