Doctor : మహారాష్ట్రలో దారుణం జరిగింది. సతారా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలు గురువారం రాత్రి హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించింది. గత ఐదు నెలలుగా ఒక పోలీసు అధికారి తనపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆమె తన అరచేతిలో ఒక సూసైడ్ నోట్ కూడా రాసుకుంది. దీంతో పాటుగా మరో మరో 4 పేజీల నోట్‌ను పోలీసులు గుర్తించారు. పోలీసు కేసుల్లో నిందితులకు ఫేక్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని వైద్యురాలు తన సూసైడ్ నోట్ లో తెలిపింది. చాలా మందిని కనీసం పరీక్షలకు కూడా తీసుకురాలేదని, ఓ ఎంపీ, ఆయన సిబ్బంది కూడా వేధించారని ఆమె ఆరోపించారు.
బాధితురాలు తన సూసైడ్ నోట్‌లో, పోలీసు అధికారి గోపాల్ బదానే ఐదు నెలల్లో తనపై అనేకసార్లు అత్యాచారం చేశాడని రాసింది. ఆమె నోట్‌లో ప్రశాంత్ బంకర్ అనే మరో వ్యక్తి పేరును కూడా ప్రస్తావించింది. అతను తనను మానసికంగా వేధించాడని ఆరోపించింది. ప్రశాంత్ బంకర్ డాక్టర్ ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు. 28 ఏళ్ల ఆ వైద్యురాలు బీడ్ జిల్లాకు చెందింది.ఆమె ఫల్తాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తు్ంది.
ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపారు. డాక్టర్ చేతిలో రాసిన సూసైడ్ నోట్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆరోపణలు ఎదురుకుంటున్న పోలీసు ఆఫీసర్ గోపాల్ బదానేను సస్పెండ్ చేశారు. మరో నిందితుడు ప్రశాంత్ బంకర్ కోసం వేట ప్రారంభించారు.
ఈ కేసుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే స్పందించారు. సీఎం ఆదేశాల మేరకు, ఆత్మహత్యకు కారణమైన పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని సతారా ఎస్పీని ఆదేశించారు. మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛీఫ్ రూపాలి చాకణకర్ కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కేసు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.
