Sisters : బాత్రూమ్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి..ఏం జరిగిందంటే?

Sisters

Sisters :  కర్ణాటకలోని మైసూరు జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. గీజర్ నుంచి గ్యాస్ లీకై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. బాత్‌రూమ్‌లో గ్యాస్ లీకేజ్ పీల్చి గుల్ఫామ్(23), సిమ్రాన్ తాజ్(20) చనిపోయారు. పెరియపట్నంలోని జోనిగేరి వీధిలో అల్తాఫ్ పాషా కుటుంబం అద్దె ఇంట్లో నివసం ఉంటుంది. గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు స్నానం చేయడానికి వెళ్లారు. బాత్రూమ్‌లో గ్యాస్‌ గీజర్‌ను ఆన్ చేయగానే, దాని నుంచి వెలువడిన విషపూరిత వాయువు పీల్చడంతో ఇద్దరూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.

ఎంతసేపటికి బాత్రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో

దీంతో వెంటనే స్పృహ కోల్పోయి అక్కడే కుప్పకూలిపోయారు. ఎంతసేపటికి బాత్రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మరణించినట్లుగా డాక్టర్లు వెల్లడించారు. ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న మంత్రి కె.వెంకటేష్ మృతుల కుటుంబాన్ని పరామర్శించి, వారికి సానుభూతి తెలిపారు.

మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన డాక్టర్ ప్రమోద్ కుమార్ దీని గురించి మాట్లాడుతూ, కార్బన్ మోనాక్సైడ్వాయువును పీల్చడం వల్లే ఈ యువతులు మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని అన్నారు. పెరియపట్నం మార్చురీలో ఇద్దరు యువతుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి, శుక్రవారం సాయంత్రం బెట్టడపుర గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై పెరియపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అల్తాఫ్ పాషాకు నలుగురు కుమార్తెలు కాగా వారిలో ఇద్దరికి పెళ్లి అయింది.

మరణించిన గుల్బమ్ తాజ్ (23)కు ఇటీవల ఎంగేజ్‌మెంట్ జరిగింది. త్వరలో ఆమెకు వివాహం జరగాల్సి ఉంది. అల్తాఫ్ పాషా కుటుంబం ఇటీవల పిరియాపట్నలోని జోనిగేరి వీధిలో కొత్త అద్దె ఇంట్లోకి మారారు.

ఈ కొత్త ఇంటికి సంబంధించి గురువారం రాత్రి పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పూజ రోజునే ఈ ఘోరం జరిగింది. పూజ పండుగ వాతావరణంలో ఉన్న ఇంట్లో, వియ్యంకుల సమక్షంలోనే ఈ దారుణం జరగడం.. ఇద్దరు యువతులు మరణించడం అల్తాఫ్ పాషా కుటుంబాన్ని, బంధువులను తీరని దుఃఖంలో ముంచింది. పెళ్లి కూతురు కాబోతున్న కుమార్తెను అకాలంగా కోల్పోవడం ఆ కుటుంబానికి జీర్ణించుకోలేని విషాదంగా మారింది.

గ్యాస్ గీజర్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గీజర్‌ను వెంటిలేటర్ దగ్గర ఉంచాలి. బాత్రూంలో కిటికీ ఉండటం కూడా చాలా అవసరం అని వైద్యులు అంటున్నారు.