Wi-Fi ID : కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలోని ఓ గ్రామంలో వైఫై (Wi-Fi) యూజర్ ఐడీ తీవ్ర కలకలం రేపింది. జిగణి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లుబాళు గ్రామంలో వైఫై కనెక్షన్ కోసం వెతుకుతున్న సమయంలో పాకిస్తాన్ జిందాబాద్ అనే దేశ వ్యతిరేక యూజర్ ఐడీ కనపడటం సంచలనంగా మారింది. ఈ దేశ వ్యతిరేక యూజర్ ఐడీని చూసి గ్రామస్థులు, బ్యాంకు సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామంలో ఏదో దేశ వ్యతిరేక ఉగ్రవాద శక్తి ఉందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై బజరంగ్‌దళ్ కార్యకర్తలు జిగణి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎన్‌సీఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
“గ్రామస్థులు, బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాం. ఇది కేవలం ఎవరైనా చేసిన అల్లరి పనా, లేక ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేందుకు చేసిన చర్యనా అనే కోణంలో విచారణ జరుపుతున్నాం. ఈ వైఫై నెట్‌వర్క్ మూలాన్ని గుర్తించే ప్రయత్నం జరుగుతోంది,” అని జిగణి పోలీసులు తెలిపారు.
కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో వైఫై సమస్యను స్థానిక ముస్లిం వ్యక్తికి పని అప్పగించారు. ఈ దేశద్రోహ ఐడీని చూసిన తర్వాత అనుమానంతో ఆ వ్యక్తికి ఫోన్ చేయగా, అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఈ కారణం వల్ల అనేక అనుమానాలకు తావిచ్చింది.వైఫై సర్వీసింగ్ కోసం వచ్చిన స్థానిక ముస్లిం వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం అనుమానాలకు దారితీసింది. దీంతో పోలీసులు ఆ టెక్నీషియన్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్నది ఎవరు, వారి ఉద్దేశం ఏమిటనేది తేల్చేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
