Madanapalle : రాత్రిపూట స్మశాన వాటిక వెళ్లడానికి ఎవరైనా ప్రయత్నిస్తారా.. ఆ మాట వినడానికి కూడా భయపడిపోతారు. అలాంటిది… అదే స్మశాన వాటికలో ఫ్రెష్ గా పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయాలంటే అమ్మా బాబోయ్.. ఇంకేమైనా ఉందా..మన పని ఔట్.. కానీ ఓ దుర్మార్గుడు.. అదే పనిచేశాడు.. చివరకు దొరికిపోయాడు. చితకబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణ శివార్లలో ఆదివారం రాత్రి ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.. మదనపల్లె(Madanapalle) శివార్లలో అంకిశెట్టిపల్లి మార్గంలో గల స్మశాన వాటికలో పాతిపెట్టిన ఓ శవాన్ని జైపూర్ యువకుడు వెలికితీశాడు. మృతదేహాన్ని పూర్తిగా బయటకు తీస్తుండగా గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
జాదు చేసేందుకే తాను శవాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించానని జైపూర్ కు చెందిన గోవింద్ అంటున్నాడు. స్థానికులు నిన్నటి రోజున ఓ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అదే రోజున రాత్రి గోవింద్ ఆ శవాన్ని బయటకు తీయబోయాడు. మట్టిని తొలగించి పూర్తిగా ఆ మృతదేహాన్ని బయటకు తీస్తుండగా స్థానిక ప్రజలు గుర్తించి ఎవడ్రా అని బెదిరించారు.
వెంటనే అతను అక్కడినుండి పారిపోతుండగా వెంటపడి పట్టుకున్నారు. మృతదేహానికి సంబంధించిన అవయవాలు అపహారించేందుకు ఇలా చేసి ఉంటాడని అనుమానించి, దేహశుద్ధి చేశారు. అనంతరం తాలూకా పోలీసులకు అప్పగించారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
అతడి ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉండటంతో, తాంత్రిక పూజలు లేదా క్షుద్ర విద్యల కోసం ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన అయితే స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
