Eluru : దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటూ “పుష్ప 2: ది రూల్” సినిమాలోని అల్లు అర్జున్ ఓ పోలీస్ కు సవాల్ చేస్తాడు. కానీ అది సినిమా.. బయట కూడా ఇలాంటి సవాళ్లు చేస్తే ఎలా ఉంటుందో ఓ దొంగకు ఏలూరు పోలీసులు రుచి చూపించారు. తాను ఇప్పటి వరకు బండ్ల దొంగతనాల్లో సెంచరీ చేశానని, ఎన్నోసార్లు దొరికిపోయిన కొన్నాళ్లకే బయటకొచ్చేశా.. పోలీసులు నన్నేమీ చేయలేరంటూ ఓ దొంగ వీడియో చేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల కంట పడింది. పోలీసులకే సవాల్ చేస్తే ఊరుకుంటారా.. పట్టుకుని మరి దూల తీర్చారు. అతనితో పాటుగా అతని గ్యాంగ్ ను కూడా అరెస్ట్ చేశారు.
Thief : Catch me if you can#EluruPolice : Thank you for the evidence! pic.twitter.com/kRByI5XMUQ
— Eluru District Police (@SpEluruDistrict) November 7, 2025
ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నూజివీడు పరిసర ప్రాంతాల్లో కొన్నాళ్లుగా బైక్‌లు దొంగతనానికి గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే దులాయ్ గణేశ్ అలియాస్ నాగపవన్ ఇటీవల బైక్ చోరీల్లో సెంచరీ చేశానంటూ ఓ వీడియో తీసుకొని, మిత్రులకు పంపాడు. అది సోషల్ మీడియా ద్వారా పోలీసుల వరకు చేరింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఐదుగురితో కూడిన దొంగల ముఠాను పట్టుకున్నారు.
నూజివీడు రెల్లిపేటకు చెందిన దలాయ్ గణేశ్, గాంధీబొమ్మ కూడలికి చెందిన షేక్ మెహర్‌బాబా, ఎంఆర్ అప్పారావు కాలనీవాసులు షేక్ ఆసిఫుల్లా, చిత్తూరి అజయ్‌కుమార్, గొల్లపల్లికి చెందిన చౌటపల్లి సుభాష్‌గా గుర్తించారు. వారి దగ్గరి నుంచి 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు అలవాటు పడి ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తేల్చారు. పోలీసులకు సవాలు విసిరిన గణేశే ముఠాలోని ప్రధాన నిందితుడని గుర్తించి.. అతను చేసిన వీడియో రికార్డు ఆయనకే వినిపించారు. మద్యం మత్తులో అలా మాట్లాడానని, తప్పయిందని నిందితుడు పోలీసులకు తెలిపాడు.
