VIDEOS : ఎక్కడైతే దేశ భద్రతకు ముప్పు కలిగించే ఉగ్రవాదులు, అత్యంత ప్రమాదకరమైన నేరస్తులు శిక్ష అనుభవిస్తారో.. అలాంటి ప్రదేశమే ఇప్పుడు విలాసవంతమైన పార్టీ స్పాట్ గా మారింది. బెంగళూరులోని అత్యంత కట్టుదిట్టమైన పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు గోడల వెనుక సాగుతున్న వీఐపీ విందు దృశ్యాలు, వీడియోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి.
Undated videos have surfaced showing jail inmates using mobile phones and watching TV inside #Bengaluru’s #ParappanaAgrahara Central Jail. pic.twitter.com/pFZK4rMR6l
— Hate Detector 🔍 (@HateDetectors) November 8, 2025
సమాజానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన ఉగ్రవాదులతో సహా ఇతర నేరస్తులు జైలులోనే మందు సీసాలు పట్టుకుని, సెల్ఫోన్లలో పాటలు పెట్టుకుని మందేస్తూ, చిందేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి మరియు ఇస్లామిక్ స్టేట్ (IS) హ్యాండ్లర్ జుహాద్ హమీద్ షకీల్ మన్నా వంటి ఉన్నత స్థాయి ఖైదీలు ఒకే జైలులో మొబైల్ ఫోన్లు వాడుతున్నారు.ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జైలు వ్యవస్థలో ఉన్న లోపాలు, భద్రతా వైఫల్యాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి.
జైలులోకి సెల్ఫోన్లు, మద్యం ఎలా వచ్చాయి.. ఈ ఖైదీలకు వీఐపీ సౌకర్యాలు ఎవరు కల్పించారనే ప్రశ్నలు ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రమాదకర ఉగ్రవాదులకు కూడా ఇలా వీఐపీ ట్రీట్మెంట్ అందడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించింది. అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయి. హోంమంత్రి జి పరమేశ్వర ఈ ఘటనపై స్పందిస్తూ, బెంగళూరు సెంట్రల్ జైలులో పదేపదే జరిగిన తప్పిదాలకు ప్రభుత్వం జైలు సూపరింటెండెంట్లతో సహా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.
