Tirumala : అపచారం..అలిపిరి మెట్లమార్గంలో మటన్ తో దావత్!

tirumala

Tirumala :  గోవింద నామ స్మరణతో మార్మోగే అలిపిరి నడక మార్గంలో అపచారానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తోంది. కలియుగ వైకుంఠవాసుడి సన్నిధికి నడిచి వెళ్లే పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గంలోనే, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు కొందరు బహిరంగంగా మాంసాహారం తింటూ కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది.

టీటీడీలో ఔట్‌ సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న ఇద్దరు రామస్వామి, సరసమ్మ మెట్లమార్గంలో మాంసాహారం తింటుండగా తిరుమలకు వెళ్తున్న కొందరు భక్తులు వీడియోలు తీశారు. ఇవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్ గా మారాయి. పవిత్ర స్థలంలో మాంసం, మద్యం పూర్తిగా నిషేధించినప్పటికీ, విధుల్లో ఉన్నవారే ఈ నిబంధనలను ఉల్లంఘించడంపై టీటీడీ రియాక్ట్ అయింది. వారిపై అధికారులు తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా మరోవైపు ఔట్‌సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికులును ఉద్యోగాల నుంచి తొలిగించింది. గతంలో కూడా తిరుమలలో మాంసాహారం బయటపడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరో ఘటన జరగడం సంచలనంగా మారింది.

ఆర్జిత సేవలను టీటీడీ రద్దు

ఇక నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నవంబరు 11వ తేది మంగళవారం నాడు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుధ్ధి నిర్వహించనున్నారు.

ఆనంతరం ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 11న, నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.