సారీ సుష్మా.. శివ సినిమా బాల నటి ఇప్పుడెలా ఉందో చూపించిన RGV

rgv

RGV : నాగార్జున హీరోగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తెరకెక్కించిన చిత్రం శివ.. 2025 నవంబర్ 14న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని బాల నటి గురించి ఆర్జీవీ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను పంచుకున్నారు.

‘శివ’ చిత్రంలో విజువల్‌గా కొత్తగా, స్టైలిష్‌గా ఉండే యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటిలో ఒకటి – నాగార్జున వేగంగా సైకిల్ నడుపుతూ, ముందు సీటుపై బాల నటిని కూర్చోబెట్టుకుని చేసే ఛేజ్ సీక్వెన్స్. ఆ రోజుల్లో సేఫ్టీ ప్రమాణాలు తక్కువగా ఉన్న కారణంగా, ఈ షాట్ చాలా రిస్క్‌తో కూడుకున్నది.

ఈ రిస్క్ షాట్‌లో నటించిన బాల నటి పేరు బేబీ సుష్మ. శివ చిత్రం భారీ విజయం సాధించినప్పటికీ, సుష్మ మళ్లీ సినిమాల్లో నటించలేదు. బుధవారం ఉదయం రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో సుష్మ లేటెస్ట్ ఫొటోను షేర్ చేశారు. సుష్మ ఇప్పుడు USA లో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), కాగ్నిటివ్ సైన్స్ (Cognitive Science) లలో రీసెర్చ్ చేస్తున్నారని ఆర్జీవీ తన పోస్ట్‌లో వెల్లడించారు.

ఆ రిస్క్ షాట్‌కు సంబంధించిన విషయం గుర్తుచేసుకున్న ఆర్జీవీ… బాల నటి సుష్మకు 36 ఏళ్ల తర్వాత క్షమాపణలు చెబుతూ మరో పోస్ట్‌ పెట్టారు. “సుష్మా! ఆ సమయంలో నాకు తెలియక, నిన్ను అంతటి ప్రమాదకరమైన అనుభవానికి గురిచేసినందుకు 36 సంవత్సరాల తర్వాత నా నిజమైన క్షమాపణలను దయచేసి అంగీకరించు. అప్పటి నాలోని దర్శకత్వ దాహం అంధకారంలో పడి, నీలాంటి చిన్నారిని అంతటి రిస్క్ షాట్‌లకు గురిచేసేలా చేసింది. మరోసారి నేను క్షమాపణలు కోరుతున్నాను” అని రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్ లో వెల్లడించారు.

శివ చిత్రం నవంబర్ 14న భారీ స్థాయిలో రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసి, రామ్ గోపాల్ వర్మ, నాగార్జునతో మీడియా ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ చిత్రంలో అక్కినేని అమల, రఘువరన్ ముఖ్య పాత్రల్లో నటించారు.