Bihar : ఈయన పేరు మనీశ్ కశ్యప్. అసలు పేరు త్రిపురారీ కుమార్ తివారీ. 34 ఏళ్లు. బిహార్ రాష్ట్రం. ప్రముఖ యూట్యూబర్. తమిళనాడులో బిహార్ వలస కూలీలపై దాడులు జరుగుతున్నాయంటూ 2023లో వీడియోలు చేసి అప్‌లోడ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ అంశం సంచలనం రేపింది. దీంతో మనీశ్ పాపులర్ అయ్యారు. కానీ ఆధారరహితమైన విషయాలు ప్రసారం చేశావంటూ తమిళనాడు పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. 2024లో ఆయన బీజేపీలో చేరారు.
అనంతరం ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ‘జన్ సురాజ్’ పార్టీలో చేరి చన్‌పటియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. ఆయన యూట్యూబ్ ఛానెల్‌కు 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ పాపులారిటీ ఎన్నికల్లో తనకు కలిసి వస్తుందని, తాను తప్పకుండా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దీంతోపాటు జన్‌సురాజ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నవారంతా విద్యావంతులు కాబట్టి, జనాల్లో తన పట్ల సానుకూలత పెరుగుతుందని భావించారు. కానీ ఫలితం మరోలా వచ్చింది. 36 వేల ఓట్లతో ఆయన మూడో స్థానంలో నిలిచారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. మరోవైపు ‘జన్ సురాజ్’ పార్టీ సైతం రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. సోషల్ మీడియా పాపులారిటీ వేరు..క్షేత్రస్థాయిలో ప్రజానిర్ణయం వేరు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బీహార్‌లోని 243 సభ్యుల అసెంబ్లీలో పోటీ చేసిన 101 సీట్లలో 89 సీట్లలో బీజేపీ విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ స్ట్రైక్ రేట్ 88% ఆకట్టుకుంది. 12 సీట్లలో ఓడిపోయింది. ఈ 12 సీట్లలో నాలుగింటిలో బీజేపీ ఓటమి తేడా వెయ్యి ఓట్ల కంటే తక్కువే. పది సీట్లకు 10,000 కంటే తక్కువ ఓట్ల తేడా ఉంది.
అత్యంత హోరాహోరీగా జరిగిన మూడు పోటీలలో బీజేపీ రామ్‌ఘర్‌లో బీఎస్పీ చేతిలో కేవలం 30 ఓట్ల తేడాతో ఓడిపోయింది, ఢాకాలో ఆర్‌జెడికి 178 ఓట్లు, సీమాంచల్‌లోని ఫోర్బ్స్‌గంజ్‌లో కాంగ్రెస్ చేతిలో 221 ఓట్ల తేడాతో ఓడిపోయారు బీజేపీ అభ్యర్థులు.
