Madvi Hidma : అల్లూరి జిల్లాలో జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత మాద్వి హిడ్మా చనిపోయాడు. ఈ ఎన్‌కౌంటర్ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల త్రి-జంక్షన్ సమీపంలో జరిగింది.మావోయిస్టుల అనేక రహస్య స్థావరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.హిడ్మా పేరిట రూ.కోటి రివార్డు ఉంది. ఇక ఇదే ఎన్‌కౌంటర్‌లో ఆయన భార్య హేమ కూడా మృతిచెందింది. 1981లో అప్పటి మధ్యప్రదేశ్ (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్)లోని సుక్మా జిల్లాలో జన్మించిన హిడ్మా .. మావోయిస్టు సంస్థలో అతి చిన్న వయసులోనే కీలక స్థానానికి చేరుకున్నాడు. అతని అసలు పేరు మాద్వి హిడ్మా.
అతను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్‌కు మాద్వి హిడ్మా నాయకత్వం వహించాడు. అంతేకాకుండా సీపీఐ మావోయిస్ట్ అగ్ర నిర్ణయాధికార సంస్థ అయిన కేంద్ర కమిటీలో అతి చిన్న వయస్కుడైన సభ్యుడిగా నిలిచాడు. కేంద్ర కమిటీలో బస్తర్ ప్రాంతం నుంచి ఉన్న ఏకైక గిరిజన సభ్యుడు కూడా హిడ్మానే. హిడ్మా మరణం మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.
హిడ్మా అనేక భయంకరమైన మావోయిస్ట్ దాడులకు నాయకత్వం వహించాడు.
- 2010 దంతేవాడ దాడి: ఈ దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ (CRPF) సిబ్బంది మరణించారు.
- 2013 జిరామ్ ఘాటీ దాడి: ఈ మెరుపుదాడిలో అగ్ర కాంగ్రెస్ నాయకులతో సహా మొత్తం 27 మంది మరణించారు.
- 2021 సుక్మా-బీజాపూర్ దాడి: ఈ దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
- హిడ్మా ఎత్తు5.6 అడుగులు.విద్యార్హత పదో తరగతి వరకు చదువుకున్నాడు. హిందీ, కోయ భాషల్లో నిష్ణాతుడు. హిడ్మా పేరిట మొత్తం 27 కేసులు నమోదై ఉన్నాయి.
హిడ్మా మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ అయిన బాలల సంఘం నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. క్రమంగా అంచెలంచెలుగా ఎదిగి, పీఎల్జీఏ ప్లాటూన్-1 కమాండర్‌గా, స్టేట్ మిలటరీ కమాండర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. హిడ్మా ఎప్పుడూ మూడు అంచెల భద్రత మధ్య ఉండేవాడు. దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో వలయాకారంలో హిడ్మాకు అత్యంత పటిష్టమైన మూడంచెల భద్రత ఉండేది. పువర్తి, జేగురుగుండా, తెర్రం, గుండం, కోవరగట్ట, కొండపల్లి వంటి గ్రామాల్లో హిడ్మాకు అత్యంత బలమైన సమాచార నెట్‌వర్క్ ఉండేది. ఇంతటి భద్రత, బలమైన నెట్‌వర్క్ ఉన్న హిడ్మాను భద్రతా బలగాలు ఈ ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం మావోయిస్ట్ ఉద్యమానికి పెను నష్టం అని చెప్పాలి.
