IBOMMA నిర్వాహకుడు ఇమండి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సైబర్‌క్రైమ్ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాంపల్లి కోర్టు ఇమండి రవిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం పోలీసులు అతనిని సమగ్రంగా విచారిస్తున్నారు. వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాల వలన అసలు మనషులంటనే రవికి నమ్మకాన్ని కోల్పోయాయి.
నాలుగేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టుగా పోలీసులు విచారణలలో తేల్చారు. అమీర్‌పేట్‌లోని కోచింగ్ సెంటర్లో ఓ యువతితో రవికి పరిచయం ఏర్పడగా అది ప్రేమగా మారి 2016లో మతాంతర పెళ్లికి దారితీసింది.ఏడాదిపాటు ఇద్దరు దంపతులుఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉన్నారు. వీరికి సంతానంగా ఓ పాప కూడా ఉంది. అనంతరం దంపతుల మధ్య ఆర్థిక ఇబ్బందులు కాపురంలో చిచ్చుపెట్టాయి.
తన అక్క, బావ విదేశాల్లో ఉంటూ కోట్లు సంపాదిస్తున్నారని, నీకు డబ్బు సంపాదించడం రాదంటూ రవిని అతని భార్య ఘోరంగా ఎగతాళి చేసేది. భార్యకు తోడుగా అత్త కూడా వంత పాడేది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడాకుల వరకు వెళ్లిపోయి విడిపోయారు. దీంతో కూతుర్ని భార్య తీసుకెళ్లటంతో రవి ఒంటరిగా మిగిలిపోయాడు. కనీసం కూతుర్ని చూడాలని ఉన్నా అవకాశం కూడా అతనికి లేకుండా పోయింది.
ఆ సమయంలో రవి వెబ్సైట్ డెవలప్మెంట్, వెబ్ డిజైన్, సర్వర్ మేనేజ్మెంట్లో పనిచేశాడు. ఆ ఉద్యోగాలు పెద్దగా ఆదాయం తెచ్చిపెట్టలేదు. పదే పదే అవమానాలు రావడంతో అతను పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి ప్రయత్నించాల్సి వచ్చింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కసితో పైరసీ సినిమాలు, గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులతో వ్యాపార లావాదేవీలు, విదేశాలకు తిరుగడం మొదలుపెట్టాడు.
నవంబర్ 14న కూకట్‌పల్లిలోని ఓ ఆపార్ట్ మెంట్ లో రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతని నివాసంలో తనిఖీలు చేయగా పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి. రవి ఇల్లంతా చిందరవందరగా కనిపించాయి. దుమ్ము ధూళి కొట్టుకుపోవటం వలన ఇల్లంతా ఘెరంగా ఉండిపోయింది. రెండు నెలలకో ఏదోక దేశం వెళ్లి తిరిగినా తప్పనిసరిగా ఇంటికి చేరేవాడు.
తన గుట్టు బయటపడుతుందనే భయంతో రవి మనుషులను నమ్మడం కూడా మానేశాడు. పనివాళ్లను కూడా పెట్టుకోలేదు. రవి ఫోన్లో కూడా కేవలం ఫుడ్ డెలివరీ బాయ్స్ నంబర్లు మాత్రమే ఉన్నాయి. ఇంటి స్మార్ట్ డోర్‌లాక్‌కు సిక్రెట్ కెమెరా అమర్చాడు.. ఎవరైనా బయటి వ్యక్తులు వస్తే ముందుగా కెమెరా ద్వారా తెలుసుకున్నాకే తలుపులు తీసేవాడు. పోలీసులు చెకింగ్ టైమ్ లో ఈ కెమెరాను ముందుగానే పసిగట్టారు.
మరోవైపు ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగింది. పైరసీ ద్వారా వచ్చిన డబ్బుకు సంబంధించి మనీలాండరింగ్ జరిగిందని అనుమానిస్తూ, రవి బ్యాంకు ఖాతాల నుంచి రూ. 3.5 కోట్లకు పైగా డబ్బును స్తంభింపజేసింది. రవి అరెస్ట్ తర్వాత, పోలీసులు iBommaతో పాటుగా దాని అనుబంధ వెబ్సైట్లను బ్లాక్ చేయించారు.
