సజ్జనార్కు షాకింగ్ ట్విస్ట్: IBOMMA మళ్లీ వచ్చేసింది!

Ibomma

IBOMMA నిర్వాహకుడు ఇమండి రవిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన వెబ్‌సైట్‌ను శాశ్వతంగా మూసివేశామని ఊపిరి పీల్చుకున్న కొద్ది రోజులకే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పైరసీని పూర్తిగా అరికట్టామని పోలీసులు, సినీ పరిశ్రమ పెద్దలు సంతోషంలో ఉండగా, ఇప్పుడు ఆన్‌లైన్‌లో ‘iBOMMA 1‘ పేరిట కొత్త వెబ్‌సైట్ ప్రత్యక్షమైంది.

అవును నిజమే.. ఇమండి రవి అరెస్ట్,ఐ-బొమ్మ వెబ్‌సైట్ క్లోజ్ అయిన తర్వాత కూడా, iBOMMA 1 అనే డొమైన్‌తో ఓ కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త వెబ్‌సైట్‌లో కూడా సరికొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇందులో ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే, అది ప్రముఖ పైరసీ వెబ్‌సైట్‌ అయిన ‘మూవీ రూల్జ్ (Movie Rulz)’ కు రీడైరెక్ట్ అవుతోంది.

iBomma ఎకో సిస్టమ్‌లో దాదాపు 65 మిర్రర్ వెబ్‌సైట్‌లు ఉన్నట్లుగా పోలీసులు గతంలో గుర్తించారు. రవి నెట్‌వర్క్‌లోని వ్యక్తులే వీటిలోంచి iBOMMA 1 ను ప్రచారంలోకి తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. iBOMMA 1 సైట్ ద్వారా మూవీ రూల్జ్, తమిళ/MV వంటి ఇతర పైరసీ వెబ్‌సైట్‌లకు ట్రాఫిక్ మళ్లుతుండటంతో, పోలీసులు ఇప్పుడు ఆయా సైట్ల నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విధంగా పైరసీని పూర్తిగా నియంత్రించడం పోలీసులకు కొత్త సవాలుగా మారింది.