Lover : ప్రియుడు ఇక లేడని.. ప్రియురాలు ఘోరం

lover

Lover :  ప్రేమించిన వ్యక్తి అకాల మరణం ఆ యువతి జీవితంలో చీకట్లు నింపింది. అతనితో ఏడడుగులు నడవాలని కలలు కన్న ఆ కళ్లు, ప్రియుడు ఇక లేడన్న చేదు నిజాన్ని భరించలేక మూసుకుపోయాయి. తన జీవిత భాగస్వామి దూరం కావడాన్ని తట్టుకోలేక, తీవ్ర మనోవేదనకు గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.

ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లాలోని కుకునూరుపల్లిలో చోటుచేసుకుంది. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం… కుకునూరుపల్లికి చెందిన ఆశని శంకర్‌ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతడికి కుమారుడు, కుమార్తె ఆశని శ్రావణి(18) ఉన్నారు. శ్రావణి ఇంటర్‌ కంప్లీట్ చేసింది. ఇంటి దగ్గరే ఉంటూ కూలీ పనులకు వెళ్తుంది.

అయితే శంకర్‌ కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఉంటే దౌల్తాబాద్‌ మండలం మల్లేశంపల్లికి చెందిన కుమ్మరి మహేష్‌ అలియాస్‌ రసీం బాబా వద్దకు వెళ్లేవారు. ఈ క్రమంలో శ్రావణికి అక్కడ మహేష్‌తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారింది.అయితే ఇటీవల మహేష్‌ అనారోగ్యంతో మృతిచెందాడు. ప్రియుడు ఇక లేడని శ్రావణి బాధలో మునిగిపోయింది. తిండి తినడం కూడా మానేసింది. శ్రావణి ప్రవర్తనలో తేడా గమనించిన కుటుంబసభ్యులు వివరాలు ఆరా తీశారు.

అయితే తాను మహేష్‌ను ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని తెలిపింది. తీవ్రంగా బాధలో మునిగిపోయిన శ్రావణి.. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి శంకర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.