Heart Attack : కర్ణాటకలోని విజయనగర జిల్లా హరప్పనహళ్లి సమీపంలోని బండ్రి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. శివమొగ్గకు చెందిన ఓ యువకుడికి పెళ్లైన మరుసటి రోజే గుండెపోటు రావడంతో మృతి చెందాడు. దీంతో సంబరాలతో నిండిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. పెళ్లి తర్వాత దేవుడి దర్శనం కోసం వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆసుపత్రికి తరలించే మార్గంలోనే వరుడు తుదిశ్వాస విడిచాడు.
ಮದ್ವೆಯಾದ ಮರುದಿನವೇ ಹೆಂಡ್ತಿ ಮನೆಗೆ ಹೋದಾಗ ಮದುಮಗ ಸಾವು: ಆಗಿದ್ದೇನು?#shivamogga #vijayanagara #groom #marriage #karnataka https://t.co/7JrwdlxnHT
— TV9 Kannada (@tv9kannada) December 3, 2025
మృతుడు శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా హనుమంతపురం నివాసి అయిన రమేశ్ (30). తల్లిదండ్రులు మరణించిన తర్వాత రమేశ్ హొసకొప్పలో ఉంటున్నాడు. ఏడాది క్రితం బండ్రి గ్రామానికి చెందిన మధు అనే యువతితో అతనికి నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 30వ తేదీన శివమొగ్గలోని బి.హెచ్. రోడ్డులోని గంగా ప్రియా కల్యాణ మండపంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
వివాహం తర్వాత, డిసెంబర్ 1వ తేదీన వధూవరులు పెళ్లికూతురి ఇంటికి వెళ్లడానికి హరప్పనహళ్లిలోని బండ్రికి వచ్చారు. దేవాలయం నుంచి ఊరేగింపుగా వారిని వధువు ఇంటికి ఆహ్వానించారు. వధువు ఇంటికి చేరుకున్న తర్వాత, దంపతులు ఇద్దరూ దేవుడి దర్శనం కోసం పూజ గది వద్దకు వెళ్లారు. ఇంతలోనే రమేశ్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దాంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
వెంటనే కుటుంబ సభ్యులు రమేశ్‌ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, దురదృష్టవశాత్తూ మార్గమధ్యంలోనే రమేశ్ మరణించినట్లు బంధువులు తెలిపారు. మరుసటి రోజు శివమొగ్గలోని హొసకొప్ప గ్రామంలో రమేశ్ అంత్యక్రియలు నిర్వహించారు. పెళ్లైన మరుసటి రోజే భర్తను కోల్పోయిన వధువు మధు ఆక్రందన ఆకాశాన్ని తాకింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
