Hyderabad: అమెరికాలో ఘోరం.. ఉప్పల్ యువతి దుర్మరణం!

sahaja

Hyderabad:  అమెరికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అల్బనీలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి తీవ్ర గాయాలతో మృతి చెందింది. కూకట్‌పల్లికి చెందిన మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. వెస్ట్రన్ అవెన్యూలోని ఒక నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో చనిపోయిన యువతిని ఉప్పల్‌లోని జోడిమెట్లకు చెందిన సాహజా రెడ్డి ఉడుముల (24) గా గుర్తించారు.

సాహజా రెడ్డి ఉడుములది జనగామల జిల్లా .. గూడూరుకు చెందిన ఉడుముల జయకర్ రెడ్డి, మరియా శైలజ దంపతుల కుమార్తె అయిన సాహజ.. అల్బనీ విశ్వవిద్యాలయం నుంచి ఏడాది క్రితం సైబర్ సెక్యూరిటీలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె అల్బనీలో ఉద్యోగం చేస్తోంది. సాహజ తండ్రి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ కాగా, తల్లి హైదరాబాద్‌లో ఉపాధ్యాయురాలు.

Sahaja

నైట్ షిఫ్ట్ చేసుకుని ఇంటికి తిరిగి వచ్చి పడుకుంది. అయితే ఉదయం 11:40 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఆ రెండంతస్తుల భవనంలో చాలా మంది భారతీయ విద్యార్థులు నివసిస్తున్నారు. “సాహజ గది సమీపంలోనే మంటలు మొదలై వేగంగా వ్యాపించాయి. ఫైర్‌ఫైటర్లు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. బతకడం కష్టమని వైద్యులు వెంటిలేటర్‌ తొలగించే ముందు, ఆమెను లైవ్ వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులకు చూపించారు. అదే మాకు చివరి చూపు అయ్యింది,” అని ఆమె బంధువు ఒకరు తెలిపారు.

సాహజ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు తానా (TANA – Telugu Association of North America), అమెరికాలో ఉన్న ఆమె బంధువులు సమన్వయంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అని ఒక బంధువు ఒకరు పేర్కొన్నారు.