చూసి నేర్చుకోవాలి.. భర్త MLA.. భార్య అంగన్‌వాడీ టీచర్‌!

mla

సాధారణంగా ఓ వ్యక్తి సర్పంచ్ అయితేనే ఆయన భార్య లైఫ్ స్టైల్ మొత్తం మారుతుంది. అలాంటిది MLA , MP అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వీటికి భిన్నంగా ఉన్నారు రుక్మిణి అనే ఓ మహిళ. భర్త ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆమె తన వృత్తిని మానలేదు…ఎప్పటి లాగే అంగన్‌వాడీకి వెళ్లి పిల్లలకు పాఠాలు చెబుతుంది.

కర్ణాటకలోని ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విఠల హలగేకర్ భార్యనే ఈ రుక్మిణి. ఈమె గత ఏడు సంవత్సరాలుగా టీచర్ గా పనిచేస్తుంది. ఉదయం 9 గంటలకు అంగన్‌వాడీకి వెళ్లి, పిల్లలకు ఆటలు, పాఠాలు, భోజనం వంటి అన్ని చేసి సాయంత్రం 4.30 గంటలకు ఇంటికి తిరిగి వెళ్తుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాకు పిల్లలు లేరు. అందుకే అంగన్‌వాడీ పిల్లల్లోనే నా సొంత పిల్లలను చూసుకుంటూ సంతోషపడుతున్నాను. రిటైర్ అయ్యే వరకు ఇదే వృత్తిలో కొనసాగతాను అని సంతోషంగా చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యే విఠల హలగేకర్ గతంలో కిడ్నీ వైఫల్యంతో బాధపడ్డారు. వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పినప్పుడు, భార్య రుక్మిణి ఏమాత్రం వెనుకాడకుండా తన ఒక కిడ్నీని దానం చేసి భర్త ప్రాణాలను కాపాడారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న విఠల హలగేకర్, “నా భార్య నాకు పునర్జన్మ ఇచ్చింది. ఆమె రుణం తీర్చుకోలేనిది. ఆమె కిడ్నీ దానం చేయడం వల్లే నేను బతికి, నేడు ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడగలుగుతున్నాను” అని కృతజ్ఞతలు తెలిపారు. అధికారం శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నంతవరకు ప్రజలకు మంచి పనులు చేయాలని, ప్రజలకు చిరకాలం గుర్తుండేలా కార్యక్రమాలు చేయాలనేది తన లక్ష్యమన్నారు.

విఠల హలగేకర్ ఉపాధ్యాయుడిగా పనిచేసి, 2023 జనవరిలో ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశారు. రిటైర్ అయిన వెంటనే మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కేవలం 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన, రెండో ప్రయత్నంలో విజయం సాధించారు.