Siddipet : సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. అయితే ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి తన ఇద్దరు భార్యలతో నామినేషన్ దాఖలు వేయించి వార్తల్లో నిలిచాడు. తాజాగా పెద్ద భార్య సర్పంచ్ గా ఏకగ్రీవం అయింది.
వివరాల్లోకి వెళ్తే.. పాతూరి నరసింహారెడ్డి అనే వ్యక్తి ఈ సారి సర్పంచ్ గా పోటీ చేయాలని అనుకున్నాడు. కానీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో పెద్ద భార్యను లావణ్యను పోటీలో దించాలని అనుకున్నాడు. అయితే నామినేషన్ పత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే స్క్రూటినీలో ఎక్కడ తొలగిస్తారోనన్న భయంతో రెండో భార్య రజితతో కూడా మరో నామినేషన్ వేయించాడు.
గ్రామాభివృద్ధికి ఆర్థిక సహకారం అందిస్తామని ఈ కుటుంబం చెప్పడంతో ఇతరులు పోటీలో లేరు. తాజాగా రజిత పోటీ నుంచి తప్పుకుంటూ తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకోవడంతో లావణ్య జంగపల్లి సర్పంచ్ గా ఏకగ్రీవం అయింది. లావణ్య, రజిత ఇద్దరు సొంత అక్కా చెల్లెల్లు. ఇక గ్రామ సర్పంచ్ తో పాటుగా 10 వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవం అయ్యారు.
