Telangana : తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు చాలా మంది సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. ఇక జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో తల్లి గంగవ్వపై కూతురు పల్లెపు సుమ విజయం సాధించింది.
ఇద్దరిమధ్య పోరు హోరాహోరీగా జరగగా తల్లిపై కూతురు సుమ 91 ఓట్ల తేడాతో విజయఢంకా మోగించింది. తల్లికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపగా కూతురుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. మొత్తం గ్రామంలో 506 ఓట్లు ఉన్నాయి. గతంలో సుమ తండ్రి ఊరిలో సర్పంచ్ గా గెలిచారు. ఇక పల్లెపు సుమ అదే గ్రామానికి చెందిన అశోక్‌ను 2017లో ప్రేమ వివాహం చేసుకుంది.

ఈ ప్రేమ వివాహం గంగవ్వ కుటుంబానికి ఇష్టం లేదు. ఇప్పుడు వీరి మధ్య మాటలు కూడా లేవు.పోరులో నలుగురు ఉండగా.. చివరకు కూతుర్నే విజయం వరించింది. ప్రేమలోనూ, పోరులోనూ పతం నెగ్గించుంది సుమ.
ఇక ఈ ఎన్నికలు ఫలితాల్లో కొందరు అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చీన్యా తండాలో బీఆర్ఎస్ బలపరిచిన జాటోత్ హరిచంద్ 9 ఓట్లతో గెలిచారు. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ తండాలోనూ బీఆర్ఎస్ బలపరిచిన మెగావత్ లత 12 ఓట్లతో విజయం సాధించారు.
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో సర్పంచ్ ఓట్ల లెక్కింపు ఉత్కంఠకు దారి తీసింది. చివరికి స్రవంతి నాలుగు ఓట్లతో గెలిచింది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన భాగ్యమ్మ ఐదు ఓట్లతో గట్టెక్కారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం అంబేడ్కర్‌నగర్ 1వ వార్డులో రజనీ, రూపకు తలో 31 ఓట్లు రావడంతో డ్రా అయింది. అధికారులు ఫలితం కోసం చిట్టీలు వేయగా రూపను అదృష్టం వరించింది.
